Friday, October 4, 2024

KNL: మాద‌క ద్ర‌వ్యాల వ‌ల్ల‌ న‌ష్టాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి… ఎస్పీ బిందు మాధ‌వ్

కర్నూలు బ్యూరో : ఈవ్‌ టీజింగ్‌, యాంటీ ర్యాగింగ్‌, మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి యాజమాన్యాలు విద్యార్ధులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలులోని ఆయా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, హెచ్ ఓ డిలు, అధ్యాపకులతో కలిసి జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… యాంటీ ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలపై, సోషల్‌ మీడియా, రోడ్డు భద్రత, సైబర్‌ నేరాల పట్ల కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

విద్యార్దుల్లో క్రమశిక్షణ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ అనేవి నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయని, భవిష్యత్తు కోల్పోతారని తెలియజేయాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని తెలియజేయాలన్నారు. మాదకద్రవ్యాల బారినపడి విద్యార్దులు జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్దులకు తెల‌పాల‌న్నారు.

మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా క్రయ, విక్రయాలు జరిపినా.. లేదా సేవించినా డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అతిగా సెల్ ఫోన్ వినియోగం, సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్ స్టాగ్రామ్‌ లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

- Advertisement -

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనవసర లింకులు షేర్‌ చేయకూడదని, తెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, లోన్‌ యాప్ లు, ఇన్ వెస్ట్ మెంట్లు, ఏపీకే ఫైల్స్, బెట్టింగ్‌ యాప్స్‌ లాంటి వాటితో మోసపోకూడదని విద్యార్దులకు తెలియజేయాలన్నారు. సైబర్‌ నేరాలకు గురయితే వెంటనే 1930కి సమాచారం అందించి, సైబర్ క్రైమ్ పోర్టల్ లో (www.cybercrime.gov.in ) డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయాలని విద్యార్దులకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ నేరాలను అదుపు చేయాలంటే ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలులోని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, హెచ్ ఓ డిలు, అధ్యాపకులు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఖాజావళి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement