Tuesday, April 16, 2024

భ‌క్తుడి ప్రాణాలు కాపాడేందుకు పోలీసుల విశ్వ‌ప్ర‌య‌త్నం..

కర్నూల్ – ఒక భ‌క్తుడి ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు పెద్ద సాహ‌స‌మే చేశారు.. ఆప‌ద‌లో ఉన్న ఆ భ‌క్తుడిని కాపాడేందుకు పోలీసులంతా ఒక‌టై భుజం భుజం క‌లిపారు…న‌డిచేందుకు వీలులేని కొండ అడ‌వి ప్రాంతం నుంచి అ భ‌క్తుడిని ర‌క్షించేందుకు వారు చేసిన ప్ర‌య‌త్నం ఖాకీల‌లో మాన‌వ‌త్వం మెండుగా ఉంద‌ని మ‌రోసారి రుజువు చేసింది.. వివ‌రాల‌లోకి వెళితే క‌ర్నాట‌క రాష్ట్రానికి చెందిన వేద‌మూర్తి అనే భ‌క్తుడు శ్రీశైలం మ‌ల్ల‌న్న ద‌ర్శించుకునేందుకు న‌ల్ల‌మ‌ల అడవి గుండా పాద‌యాత్ర ప్రారంభించాడు.. న‌ట్ట‌డ‌విలోని బీమునికొల‌ను వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి అత‌డికి ఆక్సిజ‌న్ అంద‌క అక్క‌డే ప‌డిపోయాడు..అత‌డితో ఉన్న‌భ‌క్తులు వెంట‌నే 100కి ఫోన్ చేసి స‌మాచారం అందించారు.. దీంతో శ్రీశైలం ఒక‌టో టౌన్ ఎస్ ఐ హ‌రిప్ర‌సాద్ నాయ‌క‌త్వంలోని పోలీస్ బృందం ఆక్సిజెన్ సిలెండ‌ర్, స్ట్రెచ‌ర్ తో స‌హా వేగంగా అక్క‌డికి చేరుకున్నారు.. ముందుగా భ‌క్తుడికి ఆక్సిజెన్ అందించారు.. అనంత‌రం స్ట్రెచ‌ర్ పై చేర్చారు.. స్ర్టెచ‌ర్ ను త‌మ భుజాల‌పై వేసుకుని మోసుకుంటూ కొండ‌రాళ్ల మార్గం కుండా కైలాస‌ మార్గం వైపుకి తీసుకెళ్లారు.. ఎంతోక‌ష్ట‌ప‌డి మోసుకుంటూ కైలాస మార్గం చేర్చిన భ‌క్తుడిని అక్క‌డ ఉన్న వైద్యుడు అత‌డిని ప‌రిక్షించి మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించారు.. ఎంతో క‌ష్ట‌ప‌డి ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించిన ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల పోలీసు సిబ్బంది క‌న్నీళ్లు పెట్టుకున్నారు.. ఆప‌ద‌లో ఉన్న వ్య‌క్తిని కాపాడ‌టంలో పోలీసులు చూపిన మాన‌వ‌త్వం, తెగువ‌ను భ‌క్తుల‌తో పాటు పోలీస్ ఉన్న‌తాధికారులు ప్ర‌శంసించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement