Friday, April 19, 2024

పాఠశాల పెచ్చులు ప‌డి.. ఇద్దరు విద్యార్థుల‌కు తీవ్ర‌ గాయాలు

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో స్లాబు పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 2వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ క్లాస్ రూమ్ లో ఉండగా ఒక్కసారిగా సీలింగ్ పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తరగతి గదిలో ఉన్న సఫాన్, అరీఫ్ అనే విద్యార్థుల తలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయ‌ని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాఠశాలను మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
గోనెగండ్ల ఘటనపై చంద్రబాబు ఆవేదన :
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాధమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారుల తలలకు తీవ్ర గాయాలైన ఘటన బాధాకరమ‌ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం ఏమీ చేయడం లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణగా పేర్కొన్నారు. చిన్నారులకు గాయాలు కావడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement