Saturday, April 20, 2024

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు : మంత్రి బొత్స సత్యనారాయణ

కర్నూలు బ్యూరో : రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఒక డిగ్రీ కళాశాల, మండలానికి రెండు జూనియర్ ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. మంగళవారం ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన మూడో విడత జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తమ నియోజక వర్గానికి డిగ్రీ కళాశాల కోరారని, అయితే రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లోనూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పమన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బైజుస్ వంటి సంస్థతో ఒప్పందం చేసుకుని పెద్దింటి పిల్లలకంటే గొప్ప చదువులు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అక్టోబర్ నుంచి బైజుస్ సంస్థ ద్వారా 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబులు అందించి కార్పోరేట్ స్కూళ్ల తరహాలో మంచి ఇంగ్లీష్ చదువులు చెబుతామన్నారు. పేదల పిల్లలు ఠీవిగా, తలెత్తుకుని చదవాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశానని, కానీ విద్య,వైద్య రంగాలను రెండు కళ్లుగా భావించి, ఇలా ఒక యజ్ఞంలా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ, పథకాలపై సమీక్ష చేసిన ప్రతిసారీ మరింత మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని కొనియాడారు.

మొదటి విడతలో 42.34 లక్షల మందికి విద్యాకనుక అందిస్తే, రెండో విడతలో 45.71 లక్షలు, 2022-23 లో మూడో విడతగా 47.40లక్షల మందికి రూ.931 కోట్లతో అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రైవేటు స్కూళ్లలో చదివే ఐదు లక్షల మందికి పైన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారడం ప్రభుత్వ నిబద్ధతకు విజయంగా అభిప్రాయపడ్డారు. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమైతే తల్లిదండ్రుల్లో పిల్లల స్కూల్ ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు కొనాలి అనే గుబులు ఉండేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పేదవాడికి విద్యను కనుచూపు మేరకు తీసుకొస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకేసి విద్యాకానుక వంటి పథకాల ద్వారా విద్యను మరింత అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement