Thursday, April 25, 2024

వైద్యులే ప్రత్యక్ష దైవాలు : జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్

ప్రజలకు నిరంతరం సేవలు చేస్తున్న వైద్యులే ప్రత్యక్ష దైవాలని జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్ అన్నారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ కర్నూలు ప్రభుత్వాసుపత్రి కార్డియాలజి విభాగంలో విశేష సేవలందించిన కార్డియాలజి ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ కు “సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్” అవార్డు అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని కార్డియాలజి విభాగాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, వేలాది రోగులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పునర్జన్మనిచ్చిన డా. చంద్రశేఖర్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడన్నారు. ఆయనకు తన స్వహస్తాలతో అవార్డునందించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. ఒక వైద్యునిగానే కాకుండా ఒక సమాజ సేవకుడిగా డా.చంద్రశేఖర్ అందిస్తున్న సేవలు ఇతర వైద్యులకు ఆదర్శనీయమని జిల్లా జడ్జి అన్నారు.

ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ… సేవాకార్యక్రమాలకు అత్యున్నత అవార్డు పొందిన డా. చంద్రశేఖర్ తనకు సహవిద్యార్థి కావడం తనకు ఎంతో స్పూర్తినిస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ హోదాలో డా.చంద్రశేఖర్ హయాంలో ఆసుపత్రి రూపురేఖలే మారిపోయాయన్నారు. పరిపాలనలో ఆయన పాటించిన సంప్రదాయాలను కొనసాగించడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సౌత్ ఇండియా ఇన్ఛార్జి డా.ఎలియాజర్ మాట్లాడుతూ… కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో రెండు దశాబ్దాలుగా డా. చంద్రశేఖర్ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను, కొవిడ్ ఫస్ట్ వేవ్ లో కర్నూలు కొవిడ్ నుంచి గట్టెక్కడానికి ఆయన ముందుచూపుతో తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఈ అవార్డు ప్రకటించామని చెప్పారు. యావత్ దక్షిణ భారతదేశంలోనే ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వైద్యుడు డా. చంద్రశేఖర్ కావడం కర్నూలు ప్రజలకు గర్వకారణమని అన్నారు.

అవార్డు గ్రహీత డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట తాను కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అడుగిడినప్పటి నుంచీ పెద్దాసుపత్రిని ఒక దేవాలయంలా భావించి చిత్తశుద్ధితో విధులు నిర్వహించానన్నారు. తాను, తన సహచరులు చేసిన నిర్విరామ కృషి వల్ల 2003 సం.లో ఐ.సి.సి.యు ఏర్పాటైందన్నారు. అదేవిధంగా 2008 సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ ద్వారా ఆరు జిల్లాలలోని వేలాది రోగులకు సేవలందించామని చెప్పారు. 2016 నుంచీ గుండె ఆపరేషన్లు కూడా మొదలయ్యాయన్నారు. కార్డియాలజీలో పి.జి సీట్లు సాధించడంలో తాను సఫలీకృతమ‌య్యానని ఆయన చెప్పారు. కొవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వి.డి.ఆర్.యల్ ల్యాబ్ ఏర్పాటు చేయించి కరోనా మహమ్మారిని దీటుగా ఎడుర్కొన్నామని చెప్పారు. తదనంతరం డా.చంద్రశేఖర్ కు “సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్” అవార్డును జిల్లా జడ్జి, డా.ఎలియాజర్ అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. భవాని ప్రసాద్, డా.సీతారామయ్య, డా. శ్రీనివాసులు, డా.వెంకటరమణ, ఇతర వైద్యులు, కార్డియాలజీ విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement