Thursday, April 25, 2024

మంత్రి రేసులో నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ?

నందికొట్కూరు : నిత్యం ప్రజా సేవే ద్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ, ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ, ఎవరెన్ని విమర్శలు చేసినా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ ప్రజల కోసం పరితపించే జన సైనికుడు , ప్రజల నుండి ఒక సౌమ్యుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్. గత రెండున్నర ఏళ్ళ పాలనలో ప్రజలకు ప్రతి రోజు అందుబాటులో ఉంటూ అహర్నిశలు శ్రమిస్తూ, ముఖ్యమంత్రి ఆశయాలకు, ఆయన ఆదేశాలను పాటిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్థర్. కరోన సమయంలో ఫస్ట్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లలో ప్రజలకు అందుబాటులో వుంటూ గ్రామాల్లో వీధి వీధిన తిరిగి ప్రజలకు కరోన వైరస్ పై అవగాహన కల్పించి ప్రజల మన్ననలు పొందారు. అంతే కాకుండా కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ కరోన సమయంలో పనుల్లేక, తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడే కుటుంబాల్లో నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి ఆపద్బాంధవుడిగా పేదలను ఆదుకున్నారు.

తండ్రికి తగ్గ తనయుడిగా తమ కుమారుడు సందీప్ ఆర్థర్, కుమార్తె సింధూర లు కూడా నియోజకవర్గ ప్రజలకు మేమున్నామంటూ మేము సైతం అనే గ్రూప్ క్రెయేట్ చేసి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ఇచ్చి తండ్రి బాటలోనే చేయూతనందించారు. కరోన సమయంలో ఎమ్మెల్యే ఆర్థర్ చేసిన సేవలను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా గత ఏడాది నవంబర్ 18న సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈనెల 16 నుండి 22 వరకు మంత్రి వర్గ విస్తరణ ? ఉన్నట్లు సమాచారం. ఇది నిజమైతే ఉగాదికి మంత్రి గా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు మంత్రి పదవి ? ముఖ్యమంత్రి ఇస్తారంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలోనే పక్కా మాస్ లీడర్ గా విజన్ ఉన్న ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు తొగురు ఆర్థర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా, అసెంబ్లీలో మార్షల్స్ గా పనిచేసి మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ గా పని చేసిన ఆయన నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మంత్రి పదవి ఇచ్చినా ఆశ్యర్య పోవాల్సిన అవసరం లేదని చెప్పవొచ్చు. ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో ఎస్సీ కోటా కింద చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవిని అవకాశం కల్పించారు.

అయితే ప్రస్తుతం ఉగాదికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్థర్ కు ఎస్సీ కోటా కింద మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి చెందిన మూలింటి మారెప్ప కు మంత్రి పదవి ఇచ్చి చరిత్ర సృష్టించారు. జిల్లాలో పేరు మోసిన హేమ హేమీ రాజకీయ నాయకులు ఉండగా రాజకీయా యోధులను కాదని తనకు నచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వడంతో వైయస్ఆర్ అప్పట్లో సంచలనంగా సృష్టించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని నందికొట్కూరు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. కరోనా విలయతాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఆర్థర్ రోజుకు 12 గంటలు పని చేస్తూ కరోనాపై  ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ముందుకు వెళుతూ ప్రజలకు సేవ చేసిన ఘనత జిల్లాలో మొదటగా ఆయనకే దక్కింది.

నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు, అభిమానులు నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా, జిల్లా అభివృద్ధికి పాటు పడతారని, ఆయనకు ఏ పదవి ఇచ్చిన ఆ పదవికి రాష్ట్రంలో వన్నెతెచ్చే విధంగా పనిచేస్తారని ఎమ్మెల్యే వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేసిన ప్రజసంకల్ప యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కూడా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో 6 మండలాల్లోని గ్రామాల్లో 189 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తమ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పలు రకాల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నేడు జగనన్న అమలు చేస్తున్న నవరత్నాలలోని పథకాలు గ్రామాల్లో కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. నేడు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 1.50 కోట్లు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీల అభివృద్ధి ,నిధులు వచ్చేలా చూస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. సిసి రోడ్లు ,డ్రైనేజీ కాలువలు ఇతర కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. నందికొట్కూరు పట్టణానికి రూ. 109 కోట్లతో అలగనూరు రిజర్వాయర్ నుండి పైపులైన్ల ద్వారా పట్టణానికి నీటి సమస్య పరిష్కారం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇంత గొప్ప నాయకుడికి నందికొట్కూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావడం తమ అందరి అదృష్టమని, రాష్ట్ర ప్రజలకు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి పాలన అందిఅటున్నారని , ఎమ్మెల్యే ఆర్థర్ కూడా అందరికి అందుబాటులో ఉంటూ రాజకీయ వర్గ విభేదాలు లేకుండా ప్రజా సేవకుడిలా ముందుకు వెళ్తున్నారని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్ర ప్రజలకు, కర్నూలు జిల్లా ప్రజలకు తనదైన శైలిలో అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తారని నియోజకవర్గ ప్రజలు, వై కాపా నాయకులు, ఎమ్మెల్యే ఆర్థర్ అభిమానులు కోరుతున్నారు.

పాదయాత్ర ముగింపు సభ రాష్ట్రంలోనే సంచలనం:
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 189 కిలోమీటర్లు 6 మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్య ఇది అని చెబితే సంబంధిత అధికారులకు వివరించి పరిష్కారం చేసారు. ఆయన చేస్తున్న పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగనన్న పాలనలో మా కుటుంబంలో అమ్మఒడి, వై ఎస్ ఆర్ పింఛన్ కానుక, వై ఎస్ ఆర్ చేయూత, జగనన్న తోడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపి వైకాపా లో చేరారు. అంతే కాకుండా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ సభ కూడా జరగనంత విధంగా ప్రజసంకల్ప యాత్ర ముగింపు సభకు మహిళలు, హాజరై విజయవంతం కావడం రాష్ట్రంలోనే సంచలనంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ కు మంత్రి పదవి వస్తే వైకాపా పార్టీ నందికొట్కూరు నియోజకవర్గంలో మరింత బలపడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement