Saturday, April 20, 2024

పొద్దస్తమానం తిరిగినా కడుపునిండదు.. గిరిజనులకు అడుగడుగునా అన్యాయం

కర్నూలు, (ప్రభన్యూస్‌) : జిల్లాలోని అటవీ ఫల సహాయం సేకరణలో గిరిజన సహకార సంఘం వెనకబడిపోతున్నది. సాధించాల్సిన లక్ష్యం చతికిలబడుతున్నది. గతంలో మాదిరిగా అటవీశాఖ నిబంధనలు లేకపోవడం, సేకరణకు వెళ్లే గిరిజనులు క్రమేణా తగ్గడం ప్రధాన కారణంకాగా, గతంలో పెద్దఎత్తున అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులు నేడు ఆ సంఖ్య తగ్గుతున్నది. ముఖ్యంగా నల్లమల ఆధారంగా నంద్యాల పట్టణంలోని గిరిజన సహకార సంఘం ఏర్పాటైంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, బండి ఆత్మకూరు, పాణ్యం, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల పరిధిలోని వివిధ చెంచుగూడేలలో 1200 మంది అటవీ ఫల సేకరణ చేసేందుకు అనుమతివ్వగా, 2021-22 లక్ష్యం రూ.35 లక్షలు కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 8 లక్షలు మాత్రమే ప్రగతి సాధించారు. కొట్టాలచెరువు, పెద్ద చెరువు, శివపురం, ముసిలిమడుగు, నారపురెడ్డికుంట, నెమలికుంట, నాయినచెరువు, ఓంకారం, గాజులపల్లి, మహానంది, పాణ్యం, చెంచు కాలనీ, అహోబిలం, హరివరం, డి వనిపెంట గిరిజనులు ఫల సేకరణకు వెళ్తుంటారు. తేనె, జిగురు, మారేడుగడ్డలు, కానిగపప్పు, కుంకుడుకాయలు, ఇప్ప పూలు తదితర వాటిని సేకరిస్తారు.

ప్రస్తుతం సేకరణకు వెళ్లే గిరిజనులు తగ్గిపోయారు. గతంలో 1200 మంది ఉండగా, నేడు 450 మందికి తగ్గారు. సహకార సంఘం సేకరించినప్పుడు ఇచ్చే మొత్తం కన్నా బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పలకడంతో ఫల సహాయం తరలిపోతుంది. తేనె కిలో రూ.170, మారేడుగడ్డలకు రూ.400 అధికారులు ఇస్తుండగా, బ హిరంగ మార్కెట్‌లో రూ.600 వస్తుంది. మూడేళ్లుగా జిగురు, మారేడుగడ్డలు జీసీసీ డిపోలకు రావడం లేదు. తేనె నామమాత్రంగా వస్తున్నది. కానుగపప్పు, కుంకుడుకాయలు, ముష్టిగింజలు మాత్రమే వస్తున్నాయి. మూడు సంవత్సరాల్లో కూడా లక్ష్యం సాధించలేదు. 2019-20 సంవత్సరానికి సంబంధించి 23లక్షలు కాగా, 16లక్షలు ప్రగతి సాధించగా, 2020-21 సంవత్సరానికి 30 లక్షలు కాగా, 12లక్షలు మాత్రమే ప్రగతి సాధించారు. ఈ ఏడాది 35 లక్షలకు 8 లక్షలు మాత్రమే ఇప్పటివరకు ఉత్పత్తులు సేకరించారు. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు ఉన్నందువల్ల సేకరణకు వెళ్లే గిరిజనులు తగ్గిపోతున్నారు. ప్రభుత్వం ధరల పెంపుపై దృష్టిపెడితే లక్ష్యం వందశాతం సాధించవచ్చని గిరిజనులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement