Thursday, April 25, 2024

బాల్య వివాహాలను వందశాతం అరికట్టాలి -డా.ఆర్.జి.ఆనంద్

కర్నూలు జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం బాగా పని చేస్తోందని, అయితే సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఇంకా బాగా పనిచేసి బాల్య వివాహాలను వందశాతం అరికట్టాలని అధికారులకు నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ ఆదేశించారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కన్సల్టేషన్ మీటింగ్ స్టేక్ హోల్డర్స్ పిల్లల పరిరక్షణపై డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అధికారులతో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, డి ఆర్ ఓ పుల్లయ్య, ఐసిడిఎస్ ఇంచార్జి పిడి లీలావతిలు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. మానసిక వికాసం, విద్యా వికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషిచేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు నియంత్రించాలని బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. పిల్లల భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, వేధింపులు తదితర ఫిర్యాదుల స్వీకరణకు పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లాలోని 78 పోలీస్ స్టేషన్లలో చైల్డ్ వెల్ఫేర్ పర్సన్ లకు ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చి బాలల హక్కులను కాపాడాలన్నారు. అదే విధంగా విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి పర్యవేక్షణ చేసేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో డిఆర్ఓ నోడల్ ఆఫీసర్ గా ఉంటూ పర్యవేక్షణ చేస్తారన్నారు. నెలలో ఒక రోజు పిల్లల కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్. బి.ఎస్.కే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని పిల్లల ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్య శాఖ కృషి చేయాలన్నారు. అదే విధంగా జిల్లాలోని 87 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఫీవర్ క్లినిక్ పిల్లలకోసం సపరేట్గా పెట్టి మెడికల్ ఆఫీసర్లు వైద్య చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఒ కు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి పథకం కింద 15 వేల రూపాయలు అందజేస్తున్నారని సర్వ శిక్ష అభియాన్ పిఓ డాక్టర్ వేణుగోపాల్ నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ కు వివరించారు.
అందులో భాగంగా పిల్లల సమస్యల పై కర్నూలు జిల్లాలో జిల్లా మరియు మండలం, విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి పిల్లలకు సంబంధించిన సమస్యలపై ఐడెంటి ఫై చేశామని, డిసిపియూ- ఐసీపిఎస్ 2,452 మంది చిల్డ్రన్స్ రెస్క్యూ చేయడం జరిగిందన్నారు. కోవిడ్ 19 విపత్కర పరిస్థితుల్లో కూడా బాల్య వివాహాలు అరికట్టడంలో కృషి చేయడంతో పాటు వలస ఫ్యామిలీలకు పిల్లలు చదివించాలని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆపరేషన్ ముస్కాన్ పోలీసులు డిపార్ట్ మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకొని 3,494 పిల్లలను రెస్క్యూ నిర్వహించామన్నారు. 2011 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 103 మంది పిల్లలను అడాప్షన్ చేసుకోవడం జరిగింది అన్నారు. జిల్లాలోని పెద్దపాడు, ఆళ్లగడ్డ, పత్తికొండలో చిల్డ్రన్స్ హోమ్స్ నిర్వహిస్తున్నామన్నారు. పోస్కో యాక్ట్ పై స్కూల్ కళాశాల లెవెల్ విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీశైలం దేవస్థానం లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేసి బాల కార్మికులను గుర్తించామన్నారు. పసివారి చేతులు ఆడుకోడానికి కాదు.. అక్షరాలు దిద్దడానికి.. పిల్లలను బిక్షం వేసి… వారిని బిచ్చగాళ్ళుగా మార్చకండి వంటి పోస్టర్లను శ్రీశైలం దేవస్థానం వారు ఏర్పాటు చేశారని ఐసిడిఎస్ ఇంచార్జ్ పిడి లీలావతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ సభ్యులు డాక్టర్ ఆర్.జి.ఆనంద్ కు వివరించారు.

ఈ సమీక్షలో సి డబ్ల్యూ సి చైర్మన్ ఎస్ మనోహర్ రాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎన్.శేష గిరి రావ్, జడ్పీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య, సర్వ శిక్ష అభియాన్ పిఓ డాక్టర్ కె.వేణుగోపాల్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బషీరునిషా బేగం, డిఎస్పీ వెంకట్రామయ్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆర్ కేసన్న, డియంహెచ్ఓ రామగిడ్డయ్య, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.రమాదేవి, డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్.రమా, సిపిఓ బి.అనుపమ, సమాచార శాఖ ఉపసంచాలకులు పి.తిమ్మప్ప, అడ్వకేట్ ఏపీ ప్రో చైల్డ్ రీజనల్ కన్వీనర్ బి చిన్నయ్య, డిసిఆర్ బి సిఐ జీ.రవీంద్ర, ఏఎస్ఐ పి.హెచ్.శ్యామ్ సుందర్, సిడబ్ల్యూసి మెంబర్ లు ఏ. సునీత, ఎస్.మాధవి, వెంకటేశ్వర్లు, జువైనల్ హోమ్ సూపర్డెంట్ పీ.రామ్ మోహన్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, చైల్డ్ ఎన్జీఓలు తదితరులు పాల్గొన్నారు.

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ :-
కర్నూలు జిల్లా క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేసిన నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హెల్ప్ డెస్క్ కార్యాలయాన్ని దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకటరామయ్య, డి ఆర్ ఓ పుల్లలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి చైల్డ్ వెల్ఫేర్ పర్సన్ (ఏఎస్ ఐ) తో ఇప్పటి వరకు చిన్నపిల్లల సమస్యల పై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement