Wednesday, April 24, 2024

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి: పవన్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్యగా మార్చాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో అధికార మార్పిడి అనంతరం జనసేన పార్టీయే కర్నూలు జిల్లాకు ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా పేరు మారుస్తుందని తెలిపారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చినప్పుడు… అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డ సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమే అని పవన్ అభిప్రాయపడ్డారు.

ఎందరో మహానుభావుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భవించిందన్న పవన్… తెలుగువారు కలిసుండాలని పదవిని తృణప్రాయంగా వదులుకున్న బూర్గుల రామకృష్ణరావు, ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించి పి.వి. నరసింహారావు లాంటి వ్యక్తులతో పాటు పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడ్డ దామోదరం సంజీవయ్య లాంటి మహానీయులు స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని తెలిపారు.

సంజీవయ్య గురించి రెండున్నర దశాబ్దాలుగా వింటున్నానని, మేధావులు, విద్యావేత్తలు, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, విశ్రాంత అధికారులు సంజీవయ్య విశిష్టతను, పాలన దక్షతను చెబుతున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన కేవలం రెండేళ్లే ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన సేవలు వెలకట్టలేనివి, మరువలేనివి అని పవన్ అన్నారు. ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు, వెనకబడిన వర్గాలు, కులవృత్తులు చేసుకొనేవారికీ, పేదలకు పంచారని చెప్పారు. ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులిచ్చారని చెప్పారు.

వృద్ధాప్య పింఛను పథకానికి రూపకల్పన చేసి అమలు పరచారన్న పవన్… వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు తీసుకువచ్చారని తెలిపారు. వెనకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి వారికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. నేడు భాగ్యనగరానికి ఒకటే కార్పొరేషన్ ఉందంటే అది సంజీవయ్య చలవేనన్నారు. కార్మికశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మిక పక్షపాతిగా ముద్ర వేయించుకున్నారని చెప్పారు. సంజీవయ్య గొప్పదనం భావితరాలకు తెలియచేస్తామన్న పవన్.. కేవలం రెండేళ్లే పదవిలో ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నే, వరదరాజులు ప్రాజెక్టులు, కృష్ణా జిల్లాలో పులిచింతల ప్రాజెక్టులను ప్రారంభించి తన ప్రత్యేకను చాటుకున్నారని గుర్తు చేశారు. లండన్ లో అంబేద్కర్ భవన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో… అదే విధంగా సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా తీర్చిదిద్ది కాపాడుకుంటామన్నారు. అందుకోసమే జనసేన పక్షాన కోటి రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు…కానీ ఏ ఒక్కరు కూడా సంజీవయ్య ఇంటిని పట్టించుకోలేదన్నారు. ఆయన పేరును ఏ పథకానికి పెట్టలేదన్నారు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే స్మారక భవనం నిర్మించాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. మేధావులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ ద్వారా కోటి రూపాయల నిధులు సమకూర్చి ముందుకు వెళ్తామన్న పవన్.. నీతి, నిజాయతీలకి చిరునామా దామోదరం సంజీవయ్య అని అన్నారు. రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా..ఇసుమంతైన అవినీతి మరక అంటనివ్వలేదని పవన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement