- పలు చెరువులు మరవలు
- ధర్మవరం చెరువు మొదటి మరవ వెళుతోంది
- నిండుకుండలా తనకల్లు సిజి ప్రాజెక్ట్
- కనగానిపల్లి మండలం దాదులూరు వాగు ఉదృతం
- పశువులు కొట్టుకెళ్లిన వైనం
- కనగానపల్లి మండలంలో 198.2 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం
- జిల్లాలో సరాసరి వర్షపాతం 1902.2 మిల్లీమీటర్లు
- సగటు వర్షపాతం 59.4 మిల్లీమీటర్లు
- వారంలో ఇది అత్యధిక రికార్డ్ వర్షపాతం
- జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాకపోకులకు తీవ్ర అంతరాయం
- భారీ వర్షాల పట్ల రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో సహాయక చర్యలు
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుంభవృష్టి కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు రికార్డు స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సరాసరి 1902.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 59.4 మిల్లీమీటర్లు. ఇదే నెలలో వారం క్రితం ఒకేరోజు 1700 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం జిల్లాలో నమోదు కాగా, సగటు వర్షపాతం 50 మిల్లీమీటర్లు. ఇదే ఇదివరకు జిల్లాలో రికార్డ్ వర్షపాతం. దీనికి మించి సోమవారం రాత్రి ఏకంగా 1902.2 సరాసరి వర్షపాతం, సగటు వర్షపాతం 59.4 మిల్లీమీటర్ల కురవడం విశేషం.
జిల్లాలో కురిసిన కుంభవృష్టి వర్షం కారణంగా జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి మరువ వెళ్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోనే పెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన ధర్మవరం చెరువు మొదటి మరువ వెళుతుండడం విశేషం. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలంలో గల చెన్నకేశవ స్వామి గుడి (సీజీ ప్రాజెక్ట్) ప్రాజెక్టు నుండి నిండుకుండలా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని వదిలారు. కావున ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు చేశారు. జిల్లాలో అత్యధికంగా కనగానిపల్లి మండలంలో 198.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రధానంగా మండల పరిధిలోని దాదలూరు గుడి వద్ద జాతీయ రహదారికి అనుకుని ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి పశువులు సైతం కొట్టుకుపోయాయి.
పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు…
భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా పుట్టపర్తి- అనంతపురం మధ్య రాకపోకలు స్తంభించాయి. కొత్తచెరువు సమీపంలోని కొడప గాని పల్లి వద్ద రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండల కేంద్రంలోని చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలం కేంద్రం పరిధిలోని కొత్తపల్లి, అమడకూరు, కమ్మవారిపల్లి చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చెరువుల ఉధృతి తగ్గేవరకు రాకపోకలను నిలిపివేశారు.
ముఖ్యంగా కర్ణాటకలోకి ప్రవేశించేందుకు రహదారిపై నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇదే సందర్భంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోవెలగుట్టపల్లి దగ్గర చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. ధర్మవరం పట్టణంలో భారీ వర్షాలకు చెట్లు విరిగి రోడ్లపై పడడం జరిగింది. విషయం తెలుసుకున్న ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ సిబ్బందితో సహా వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రాప్తాడు నియోజకవర్గంలో పలు చెరువులు, వాగులు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
కొన్ని చెరువులకు గండ్లు పడినట్లు తెలిసి, సహాయక చర్యల్లో స్వయంగా పరిటాల సునీత పాల్గొన్నారు. ఇదే సందర్భంలో నియోజకవర్గ పరిధిలో ఎక్కడ సమస్యలున్నా తక్షణమే తనను సంప్రదించాలని ఎమ్మెల్యే సునీత ఆయా గ్రామస్తులను కోరారు. ఇదే సందర్భంలో జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలపై జిల్లా అధికారులు స్పందించి ఆయా శాఖల సహకారంతో సమస్యలు పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.