Wednesday, December 11, 2024

AP | జిల్లాను అభివృద్ధి పథంలో పరిగెత్తిస్తాం… ఎంపీ కేశినేని చిన్ని

(ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ ) : ఎన్టీఆర్ జిల్లాను రానున్న రోజుల్లో అభివృద్ధి పథంలో పరిగెత్తించేందుకు అవసరమైన ప్రణాళికల‌న్నీ సిద్ధం చేశామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమిష్టి సంపూర్ణ సహకారంతో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతం చేస్తామన్నారు. గ్రామీణ రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు రైతులకు ఎంతో ఉపయోగమైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌష్టికాహారం అందించే దిశగా హైజీనిక్ కిచెన్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్ట‌ర్ కార్యాల‌యంలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఆయన జిల్లా అభివృద్ది స‌మ‌న్వ‌య ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మీక్షా స‌మావేశం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేసీనేని శివనాథ్ జిల్లాలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా అమలు అవుతున్నాయో తెలుసుకోవ‌ట‌మే దిశా క‌మిటీ ముఖ్య ఉద్దేశ్యమ‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ పాల‌నలో ఎన్టీఆర్ జిల్లా జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కం అమ‌లు విష‌యంలో ఐదో స్థానంలో వుందని, జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ద్వారా సోర్స్ ఆఫ్ వాట‌ర్ నుంచి టాప్ క‌నెక్ష‌న్ ద్వారా ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు అందించేందుకు డీపీ ఆర్ లు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ముందు స్థానంలో వుండే విధంగా అధికారులతో క‌లిసి కృషి చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో వున్న అన్ని పి.హెచ్.సి ల్లో మ‌రిన్ని వైద్య సదుపాయాలు క‌ల్పించి అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో అంగ‌న్ వాడీ కేంద్రాల్లో హైజీనిక్ కిచెన్ ఏర్పాటు చేసే విష‌యంపై చ‌ర్చించ‌టం జ‌రిగిందని, త్వరలోనే అధికారి రూపం దాల్చుతుందన్నారు.

- Advertisement -

ప్రైమ్ మినిస్ట‌ర్ స‌డ‌క్ యోజ‌న్ ప‌థకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల క‌నెక్టివిటీ పెంచే విష‌యంపై చర్చించినట్లు తెలిపారు. దేశంలోనే ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముందు వుందని జిల్లాలో కూడా మరింత ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. వ్య‌వ‌సాయ రంగంలో కూడా డ్రోన్స్ వినియోగించేందుకు రైతుల‌కి అవ‌గాహ‌న క‌ల్పిస్తామని, సెంట్ర‌ల్ స్కీమ్స్ ద్వారా డ్రోన్స్ కి స‌బ్సిడీ వ‌చ్చే అవ‌కాశం వుందన్నారు. హైదరాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి ద్వారా ఉపాధి క‌ల్పించేందుకు ఎన్నో స్కీమ్స్ వున్నాయని, అక్క‌డ యువ‌త‌కి, రైతుల‌కి శిక్ష‌ణ ఇప్పిస్తామ్సన్నారు. అగ్రిక‌ల్చ‌ర్,ఫుడ్ ప్రోసిసెంగ్ యూనిట్ అభివృద్దికి కృషి చేస్తామని చెప్పిన ఆయన తిరువూరులో ఎన్.ఐ.ఆర్.డి ద్వారా క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పించట‌మే సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం అనే ఆ దిశగా అధికారులు సైతం చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల స‌హ‌కారంతో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తానని ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. ఈ సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇన్చార్జి కలెక్టర్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement