Monday, October 7, 2024

AP | కొలిక్కి వస్తున్న కొలికిపూడి వ్యవహారం.. నిజం గెలవాలి దీక్షకు సిద్ధం..

( ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ) : ఇటీవల వివాదాస్పదమవుతున్న తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తుంది. పలు సందర్భాలలో ఆయన కార్యకర్తలు, విలేకరులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం వివాదాస్పదమయ్యాయి. అన్ని వైపులనుండి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తూనే పార్టీ అధినేతలకు సైతం ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లాయి. ఎప్పటికప్పుడు తనపై వచ్చిన విమర్శలు ఆరోపణలను తిప్పి కొడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్, సోమవారం నిజం గెలవాలి పేరిట దీక్షకు దిగేందుకు తిరువూరులోని తన కార్యాలయంలో సిద్ధమయ్యారు.

కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన కొలికపోడి శ్రీనివాస్ మాట్లాడుతూ…. నిజం గెలవాలి తప్పు చేసిన వారికి శిక్ష పడాలని నినాదాలు చేశారు. గత వారం రోజులుగా తన గురించి తప్పుడుగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మొదటిరోజు పేకాట, రెండోరోజు ఆత్మహత్య ప్రయత్నం, మూడోరోజు లైంగిక వేధింపులు ఇసుక, గ్రావెల్, మట్టి అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు.

సాక్ష్యాలు బయట పెట్టకుండా తనపై అసత్య ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. అయితే తనలాంటి బాధ్యతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, కానీ ఇప్పుడు తన మాటలకు బాధపడిన విలేకరులందరికీ బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే, నన్ను అరెస్టు చేసి శిక్షించమన్నారు. ఆరోపణలు అబద్ధమైతే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

దీనిపై ఎటువంటి చర్యలు తీసుకునేంతవరకు తాను దీక్షలో కూర్చుంటానని ప్రకటించి వెంటనే దీక్షలో కూర్చున్నారు. అయితే కొందరు పెద్దలు కలగజేసుకుని ఆయనకు సర్దు చెప్పడంతో కొద్దిసేపటికి ఆయన దీక్షను విరమించుకున్నారు. ప్రస్తుతం విలేకరులపై కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇక్కడితో పుల్ స్టాప్ పడుతుందో కొనసాగుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement