Tuesday, March 26, 2024

కృష్ణాన‌ది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జ‌గ‌న్ శంకుస్థాప‌న‌..

విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. దీంతో కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 125 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. కాగా, 2009లో కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయవాడ వచ్చి ఫ్లడ్‌ రిటైనింగ్‌ వాల్‌ మంజూరు చేశారు. అప్పట్లో యనమలకుదురు నుంచి కోటినగర్‌ వరకు ఈ వాల్‌ నిర్మించారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం కరకట్ట (వారధి) నుంచి కోటినగర్‌ వరకు ఫ్ల్లడ్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు, , పేర్ని వెంకట్రామయ్య, పి.అనిల్ కుమార్ యాదవ్ , బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్ , మొండితోక జగన్మోహనరావు, అబ్బాయి చౌదరి, కె.పార్థసారథి, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సింహాద్రి రమేష్ ,మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎంపీ నందిగామ సురేష్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాలు సమన్వయకర్త తలశిల రఘురాం , విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి,స్థానిక కార్పోరేటర్ ఏ .వెంకట సత్యనారాయణ, స్థానిక నేతలు దేవినేని అవినాష్, పివిపి, బొప్పన భవకుమార్,
ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జె. శ్యామలరావు, కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు

రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ఇలా..
► విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు 1.5 కి.మీ పొడవునా ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తారు.
► నదికి భారీ వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్‌ వాల్‌కు రూపకల్పన చేశారు.
► ఇందులో భాగంగా మూడు అడుగుల వ్యాసంలో 18 మీటర్ల లోతుకు పైల్, రాఫ్ట్‌ పునాదులపై 8.9 మీటర్ల ఎత్తులో 1.5 కి.మీ పొడవునా కాంక్రీట్‌ గోడ నిర్మించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement