Friday, June 18, 2021

కోవిడ్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలి – కలెక్టర్ హరికిరణ్

కడప ప్రతినిధి, : జిల్లాలో కోవిడ్ కట్టడి, నియంత్రణకోసం ప్రత్యేక దృష్టి సారించాలని, సీరియస్ కేసులపట్ల అధికారులు అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధానంగా ఆసుపత్రుల్లో బెడ్ల అవైలబిలిటీ, ఆక్సిజన్ లభ్యత, రేమిడిస్పియర్ డ్రగ్ లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియలతో పాటు అత్యవసర కోవిడ్ సేవలు, ట్రాన్స్పోర్టేషన్, మౌలిక వసతుల సంసిద్ధతపై జేసీలు గౌతమి, సాయికాంత్ వర్మ, డిఆర్వో మాలోలతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ
కోవిడ్ కట్టడి నిరంతర ప్రక్రియని, కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గతంలో కంటే ప్రస్తుతం మూడింతలు అత్యధికంగా ముందస్తు జాగ్రత్తలు, నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పాజిటీవ్ కేసు నిర్ధారణ జరిగిన తక్షణమే ఆ వ్యక్తికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి, తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే ఆసుపత్రులకు తరలింపు, ఆసుపత్రుల్లో బెడ్స్ అవైలబులిటీ మొదలైన విషయాలను కోవిడ్ ఇన్సిడెంట్ కమాండర్లుగా తహసీల్దార్లు పూర్తి భాద్యతలు తీసుకోవాలన్నారు.
మండల, మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో హోమ్ ఐసోలేషన్ ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసుల ఆరోగ్య పరిస్థితిని వాలంటీర్లు, ఏ.ఎన్.ఎం.లు, ఎప్పటికప్పుడు పరిశీలించి పై అధికారులకు తెలియచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయినప్పటికీ ఆక్సిజన్ సాచురేషణ్ 94 శాతం కంటే తక్కువ ఉన్నా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా కొవిడ్ కేర్ సెంటర్ లేదా కొవిడ్ ఆసుపత్రికి తరలించాలన్నారు. ఆక్సిజన్ సాచురేషణ్ 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి హోం ఐసోలేషన్ కిట్ ను అందించాలన్నారు. కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా వారిలో అవగాహన పెంచాలన్నారు. కోవిడ్ పాజిటీవ్ కేసులు 100% రికవరీ అయ్యేందుకు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందేలా, ఆరోగ్య జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు.
పాజిటీవ్ కేసులు నమోదు అయిన వెంటనే ప్రత్యేక వైద్య టీముల ద్వారా కోవిడ్ ఎస్.ఓ.పి. ద్వారా మెడికల్ ఎక్సామిన్ చేసి ఆరోగ్య స్థితిని నిర్ధారించాలి. జిల్లాలో ఇప్పటిదాకా జిజిహెచ్ , ఫాతిమా మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు , పులివెందుల ఏరియా ఆసుపత్రి, రైల్వే కోడూరు, రాజంపేట పరిసరాల వారికి దగ్గరగా తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటుచేసామన్నారు. అయితే జిజిహెచ్ కు నేరుగా కోవిడ్ పేషంట్లను పంపరాదన్నారు. ఫాతిమా మెడికల్ కళాశాలలో కూడా పరిస్థితి మెరుగ్గా లేకపోతే అప్పుడు జిజిహెచ్ కు పంపాలన్నారు. కోవిడ్ వైద్యసేవలు అందించేందుకు అనుమతి ఇచ్చిన 19 ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వైద్యంపై దృష్టి సారించాలన్నారు.
అలాగే కోవిడ్ కేర్ సెంటర్లు గా హజ్ భవన్ కడప, ప్రొద్దుటూరులోని వెటర్నరీ కాలేజ్, పులివెందులలో జె ఎన్ టి యు , రాయచోటి లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా రాజంపేట డివిజన్ లోని ఆనంతరాజుపేట ఉద్యాన కళాశాలలో మరో సీసీ.సి. ని త్వరలొ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. ట్రాన్సిస్ట్ స్టెబిలైజషన్ సెంటర్లుగా కమలాపురం, లక్కిరెడ్డి పల్లెల్లోని సి హెచ్ సి ల్లో మినహా మిగిలిన అన్ని సి హెచ్ సి ల్లో ఏర్పాటు చేశామని, అవసరమైన వారిని అక్కడికి పంపాల్సి ఉంటుందన్నారు.
అన్ని ప్రాంతాల్లో పాజిటీవ్ కేసులు నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో తరచు మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలోని వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ లతో శానిటేషన్ నిర్వహించాలి. దీనిపై మున్సిపల్ కమీషనర్లు ఎంపిడివోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ, జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా నుంచి కోవిడ్ ను పూర్తిగా నివారించడంలో ప్రజలందరూ అవగాహనతో జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, ముఖానికి సరిగా మాస్క్ ధరించడం, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరాన్ని పాటిస్తూ, శ్యానిటైజర్ లేదా సబ్బుతో తరచుగా చేతులను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ చర్యలన్నింటినీ విధిగా పాటించడం వలన కరోన వైరస్ ను చాలావరకు నివారించగలం అని అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వీడి.. అప్రమత్తత, అవగాహనతో కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయండని సూచించారు. మాస్కు ధరించని వారిపై ఫైన్ వేయాలన్నారు. అలాగే రాత్రి కర్ఫ్యూ ని పటిష్టంగా అమలుచేయాలన్నారు.
కోవిడ్ వ్యాప్తి విస్తృతం అవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం.. ఎక్కడా జన సమూహాలు లేకుండా చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగానే.. జాతరలు, ఉత్సవాలు, తదితర జన సమూహాలు గుమికుడే.. కార్యక్రమాలకు కొంతకాలం స్వస్తి పలకాలని సూచించారు.
20 బెడ్లు అంతకంటే అధిక బెడ్స్ సామర్థ్యం ఉన్న ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు.. ముందుకు వచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు 48 గంటల్లో పర్మిషన్ గ్రాంట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాన్ని సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లతో అన్నారు.
తమ పరిధిలో ఉన్న సచివాలయాలు, వార్డుల వారీగా ఫోన్ నెంబర్లు, వాహనాల డ్రైవర్లు వారి ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలిసేవిధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. 24/7 అందుబాటులో ఉండే విధంగా షిఫ్టుల వారీగా నియమిస్తూ వారి పని తీరును సమీక్షించాలన్నారు.
జేసీ గౌతమి మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లలో అన్ని మౌలిక సదుపాయాలు, శానిటేషన్ పై కోవిడ్ కంట్రోల్ కమాండర్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొవిడ్ కేర్ సెంటర్ లో 24 గంటల పాటు డాక్టర్లు పర్యవేక్షణ చేస్తారు. ఒక అంబులెన్సు కూడా సిద్దంగా ఉండాలన్నారు. హాస్పిటల్ లో లాగానే ప్రతి రోజు డాక్టర్లు పేషంట్లను పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే అంబులెన్సులో హాస్పిటల్ కు తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం జేసీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ఎక్కడ కూడా కాంట్రాక్టు ట్రేసింగ్ ప్రక్రియలో ఆలస్యం జరగ కూడదన్నారు. అనంతరం మండలాల వారీగా ఆయా మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో అదనంగా ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
కోవిడ్ సేవలందిస్తున్న అన్ని ఆసుపత్రులలో 24 గంటలు పని చేసేలా ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను, ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక ను, ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. వైద్యుల పర్యవేక్షణ, చికిత్స అవసరమున్న కోవిడ్ రోగులను మాత్రమే ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసెలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ వైద్య సేవలు అందించే ఆసుపత్రులలో 50 శాతం బెడ్స్ ను ఆరోగ్యశ్రీ కింద చేరే కోవిడ్ రోగులకు ఖచ్చితంగా కేటాయించేలా చూడాలన్నారు.
ప్రజలందరూ కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్లు 08562-245259, 259179 లకు లేదా 104 కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఈ జిల్లా కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్లను ప్రజలందరూ తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకునెలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఆరోగ్య పరంగా ఏ ఇబ్బంది ఉన్నా జిల్లా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే సరైన సూచనలను అందిస్తారు. అలాగే టెలి కన్సల్టెన్సి కోసం 08562-244070 నెంబర్ కు ఫోన్ చేసి వైద్య సహాయం పొందవచ్చు.
ఈ కార్యక్రమంలో డివిజనల్, మండల కార్యాలయాల నుండి కడప నగర పాలక కమీషనర్ లవన్న, తహసిల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, పాల్గొనగా స్థానిక విసి హాలు నుండి డిఎంహెచ్ ఓ డా. అనిల్ కుమార్, సంబందిత శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News