Wednesday, March 27, 2024

జ్వరం వస్తే వ్యాక్సిన్ పని చేసినట్లు గుర్తించాలి

టీకా దుష్ప్రభావాలు సాధారణమే

కరోనా నివారణ వ్యాక్సిన్ తోనే సాధ్యం

బ్రహ్మంగారిమఠం : కరోనా వ్యాక్సిన్ వేస్తే జ్వరం వస్తుందట.. జలుబు, ఒంటినొప్పులు వస్తాయట..
ఇలాంటి అనుమానాలు, అపోహలు చాలా మందిలో ఉన్నాయి. దీని కారణంగా కొందరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నారు. మరికొందరు ఏకంగా టీకానే వేసుకోవద్దని తీర్మానించు కుంటున్నారు. ఇలాంటి వారు చాలా పెద్దతప్పు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు టీకా వేసినప్పుడు కూడా జ్వరం వస్తుంది. అలాగని వారికి వేయించడం మానుకోవడం లేదుకదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి టీకా వేయించుకున్న తరువాత జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వ్యాక్సిన్ పని చేస్తున్నట్లుగా భావించాలని సూచిస్తున్నారు. ప్రపంచ అధ్యయనాల ప్రకారం కరోనా వైరస్ కు తొలి డోసు తీసుకున్న 95 శాతం మందిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమందికి మాత్రమే జ్వరం, ఒంటినొప్పులు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరు కూడా పెద్దగా మందులు తీసుకోకుండానే ఒకటి, రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తున్నారు. ఒక్క శాతం మందిలో కాస్త ఎక్కువగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని అలాంటి వారికి చికిత్స అవసరమవుతుంది. ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ వల్ల ఏ ఒక్కరూ మరణించినట్లు ఆధారాలు లేవంటున్నారు వైద్యులు. దుష్ప్రభావాలు ఎదురవుతే ఆందోళన అవసరం లేదని, వైరస్ నుంచి కాపాడేందుకు శరీరంలో ప్రతి రక్తకణాల ఉత్పత్తి జరుగుతున్నట్లుగా భావించాలని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యువత లోనే ఎక్కువ దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని, మెడికల్ హిస్టరీ, వ్యాక్సిన్ రకం, శరీర రోగ నిరోధక శక్తి తదితర అంశాల పైన కూడా దుష్ప్రభావాల శాతం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా దుష్ప్రభావాలు ఉన్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి వరకు 10 కోట్ల 84 లక్షల డోసులు పంపిణీ జరిగిందని మొదటి డోసు తీసుకున్నవారు 9.56 లక్షల మంది ఉండగా, రెండో డోసు తీసుకున్నవారు1.27 లక్షల మంది ఉన్నారు. వీరిలో తీవ్ర దుష్ప్రభావాలు కనిపించిన వారి శాతం 0.019 శాతం. మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 23.17 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా 0.018 శాతం మందికే తీవ్ర దుష్ప్రభావాలు కనిపించినట్లు వైద్య అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 40 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేయాలని సంకల్పించినట్లు తెలుస్తుంది. ప్రజలు ఈ వ్యాక్సిన్ పైన అవగాహన కలిగి మొదటి డోసు, రెండో డోస్ తప్పక వేయించుకోవడం ద్వారానే కరోనాను పూర్తిస్థాయిలో జయించవచ్చు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా తప్పని సరిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ గాని, సబ్బుతో గాని తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement