Saturday, April 20, 2024

సొంత జిల్లాకే న్యాయం చేయని సీఎం.. రాష్ట్రానికి ఏం చేస్తాడు? : బీజేపీనేత‌ విష్ణు వర్ధన్ రెడ్డి

కడప : ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్రజలకంటే ముందు కడపకు క్షమాపణ చెప్పాలని, సొంత జిల్లాను కూడా విస్మరించాడని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మండిప‌డ్డారు. నగరంలోని ఆర్అండ్ బీ అతిధి గృహంలో విష్ణు వర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసాడ‌న్నారు. వరదలు వచ్చి దాదాపుగా ఏడాది అవుతున్న అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సుముఖత లేదన్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంద‌న్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ తెగిపోయింద‌ని ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా జ‌రిగింద‌న్నారు. సీఎం జగన్ జిల్లాకే న్యాయం చేయకపోతే రాష్ట్రానికి ఏమి చేస్తాడో అర్థం కావట్లేదు అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల‌న్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో కాదు కడపలో కూడా వైసిపికి ఎదురుదెబ్బ తప్పదు అని జోష్యం చెప్పారు. కేంద్ర నిధులను సైతం సీఎం జ‌గ‌న్‌ పక్క దారి పట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

దాదాపు 66 కార్పొరేషన్ లు పెట్ట‌డం జ‌రిగింద‌ని, బీసీల పక్షపాతి అన్న జగన్ కార్పొరేషన్ లకు నిధులు కేటాయించలేదు అన్నారు. కార్పొరేషన్ చైర్మన్ లు, డైరెక్టర్లు దమ్ముంటే ప్రజల ముందుకు రావాలన్నారు. కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాల‌న్నారు. బీజేపీ, జనసేన విడిపోవాలని కొంత మంది ఏపీలో కోరుకుంటున్నారు అన్నారు. 175 సీట్లు గెలుస్తామని సీఎం జగన్ చెప్తున్నాడు, రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవదని అందరికి తెలుసు అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుంది, బీజేపీ జనసేన ను విడదేసే అంత సామర్థ్యం ఎవరికి లేదు అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు కోర్టులో చుక్కెదురైంది, ఏపీలో ప్రాంతీయ పార్టీలను రానున్న కాలంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ, జనసేన అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అన్నారు. రాంగోపాల్ వర్మ ప్రచారం కోసం పరితపించే వ్యక్తి అని, అందుకే సీఎం జగన్ తో 45 నిమిషాలు వర్మ సమావేశం అయ్యార‌న‌న్నారు. కుట్ర అనే సినిమా తీస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశార‌ని, వర్మ తీసిన సినిమాలు ప్రజలు చూసే స్థితిలో ప్రజలు లేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement