Wednesday, April 24, 2024

ఏపీలో పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్

గతంలో ఏపీ ఎస్ఈసీ పదవికి అత్యంత సమీపంలోకి వచ్చి, వెనుదిరిగిన జస్టిస్ కనగరాజ్ కు ఏపీ ప్రభుత్వం ఓ కీలక పదవి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కనగరాజ్ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఏపీ సర్కారు ఈ అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను త్వరలోనే నియమించనుంది.కాగా, గతంలో ఎస్ఈసీగా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో వివాదం నేపథ్యంలో ఏపీ సర్కారు ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను ఎస్ఈసీగా ప్రకటించింది. అయితే హైకోర్టు ఆ నియామకం చెల్లదని చెప్పడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టారు.

గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఏపీ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ అథారిటీకి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కానీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐఏఎస్), ఆపై ర్యాంకులకు చెందినవారు కానీ చైర్మన్ బాధ్యతలకు అర్హులని పేర్కొంది.  చైర్మన్ కు మరో ముగ్గురు సభ్యులు విధి నిర్వహణలో సహకరిస్తారని వివరించింది. నిబంధనలకు అనుగుణంగా ఆయన వేతనాలు, ఇతర సౌకర్యాలు ఉంటాయని వెల్లడించింది. ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన ఆదేశాలు ప్రత్యేకంగా వెలువడతాయని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement