Wednesday, April 17, 2024

JR.DOCTORS STRIKE: ఏపీలో సమ్మె బాట పట్టిన జూడాలు

ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ సమ్మె సైరన్‌ మోగించింది. నేటి(డిసెంబర్ 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. డిసెంబర్ 9 వరకు వివిధ దశల్లో నిరసనలు చేపడతామని ప్రకటించారు.

సమ్మెలో భాగంగా బుధవారం ఆస్పత్రుల వద్ద నల్ల బ్యాడ్జీలతో జూడాలు నిరసనకు దిగనున్నారు. డిసెంబర్ 2న సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖలు సమర్పించనున్నారు. డిసెంబర్ 4న ట్విట్టర్ తుఫాను, మాస్ మెయిలింగ్ రూపంలో సోషల్ మీడియాలో విస్తృత క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న హాస్పిటల్స్‌లో OPD (అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌) సేవలతో పాటు డిసెంబర్ 7 నుంచి ఐచ్ఛిక సేవలను నిలిపివేయనున్నారు. డిసెంబర్ 9 నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేయనున్నట్లు జూడాలు సమ్మె నోటీస్‌లో పేర్కొన్నారు.

తమకు ఇస్తున్న స్టైఫండ్‌లో 10 శాతం ట్యాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని జూడాలు తప్పుపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా స్టైఫండ్స్​లో టాక్స్ కట్ చెయ్యడాన్ని జుడాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెక్షన్ 10 (16) కింద స్టైఫండ్‌ను స్కాలర్ షిప్‌గా పరిగణించి ట్యాక్స్ కట్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము విన్నవించినప్పటికీ వాటిని పరిగణించకుండా కొన్ని కళాశాలలో టాక్స్ ని కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే నీట్ పీజీ కౌన్సెలింగ్‌ నిర్వహించి మరికొంతమందిని నియమించుకోవాలని కోరుతున్నారు. నీట్‌ కౌన్సెలింగ్​ను వాయిదా వేయడం వల్ల ఈ సంవత్సరం ఒక బ్యాచ్ కొరత ఏర్పడిందని చెబుతున్నారు. కొవిడ్‌ ముంచుకొస్తున్న వేళ తగిన సంఖ్యలో వైద్యులు లేకపోవడంతో మిగతా వైద్యులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement