Tuesday, April 23, 2024

Guntur | యువ‌జ‌నోత్స‌వాల‌తో విద్యార్థుల్లో జోష్‌.. కాబోయే డైరెక్ట‌ర్లు, ర‌చ‌యిత‌లు, న‌టులు మీరేన‌న్న‌ రోజా

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి: విద్యార్ధుల ప్రావీణ్యతను ప్రదర్శించేందుకు కళాశాలలో నిర్వహించే యువజనోత్సవాలు దోహద పడతాయని మంత్రి ఆర్ కె రోజా అన్నారు. ఆచార్య నాగర్జున యూనివర్సీటీలో శనివారం జరిగిన అంతర్‌ కళాశాలల యువజనోత్సవాల్లో ఫుల్ జోష్ నెల‌కొంది. ముగింపు సభలో మంత్రి రోజా, యూనివర్సీటీ ఉప కులపతి ప్రొఫెసర్ పి. రాజశేఖర్, సినీనటుడు సంపూర్ణేష్ బాబుతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. నేటి తరం యువతకు ఎన్నో రకాల అవకాశాలున్నాయని వాటిని ప్రతిభతో అందిపుచ్చుకోవాల‌న్నారు. చదువుతో పాటు సాంస్కృతిక, కళలపై విద్యార్థులు మక్కువ చూపాలన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, జానపద ప్రదర్శనలు రాబోవు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఇక్కడ యువజనోత్సవాలను చూస్తుంటే తాను చదువుకున్న రోజులు గుర్తుకువస్తున్నాయని, అప్పట్లో పాల్గొన్న యువజనోత్సవాల ఫొటోలను చూసే తనకు తొలిసారి సినిమా అవకాశాలు వచ్చాయన్నారు మంత్రి రోజా. అప్పటి నుంచి ఇప్పటికి 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానన్నారు. ప్రతిభ ఎవరి సొత్తు కాద‌ని, కులం, మతం, డబ్బు అడ్డుకాద‌న్నారు.
ఇటువంటి ఉత్సవాల్లో క్రియేటివిటి, టాలెంట్‌ చూపితే బర్నింగ్ స్టార్లుగా, మోడ్రెన్ మహాలక్ష్ములుగా, స్మైలింగ్ స్టార్లుగా, రైటర్స్ గా, డైరెక్టర్స్ గా నిలుస్తారన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, అల్లరి చేయొచ్చు కానీ దానికి హద్దులుంటాయని అన్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే ఎంత వరకైన చదివించే మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉండటం విద్యార్ధుల ఆదృష్టంగా భావించాలన్నారు.

సినీ నటుడు సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. లక్ష్య సాధనకు అదృష్టం కావాలనుకోవడం సరి కాదని అంకితభావానికి మించిన అదృష్టం లేదన్నారు. ఏదైనా సాధించలేకపోతే గ్రహచారం. అదృష్టం సహకరించలేదని అనుకోవద్దని వాటిని అనుకూలంగా మలచుకునే శక్తి మనలో ఉందనేది గుర్తించాలన్నారు. విజయం కోసం మనం పరుగెడితే అదృష్టం మన వెంటే నడుస్తుందన్నారు. బాల్యంలో తల్లిదండ్రులు చెప్పే సూచనలు ఇంటర్మీడియట్ తరువాత పదేళ్ళు కూడా అనుసరిస్తే జీవితంలో అత్యున్నత స్థానంలో ఉంటామన్నారు. విలువల పతనంపై యువత పునరాలోచన చేయాలన్నారు. తల్లిదండ్రులు మనకేం ఇచ్చారని యువత అనుకోవద్దని వారికి మనమేమి ఇవ్వాలో గుర్తించాలన్నారు. స్టడీసెన్స్, కామన్సెన్స్, టైమ్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధిస్తారన్నారు.

అంతర కళాశాలల యువజనోత్సవాలు అనుసృజన-2022లో అనుబంధ కళాశాలల కేటగిరిలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన గుంటూరుకు చెందిన బండ్లమూడి హనుమాయమ్మ మహిళా కళాశాలకు, రన్నరప్ ఛాంపియన్ షిప్ సాధించిన గుంటూరు హిందూ కళాశాలకు, యూనివర్సిటీ కళాశాలల కేటగిరిలో మొదటి స్థానం సాధించిన ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కళాశాలకు, రెండో స్థానం సాధించిన సైన్స్ కళాశాల విద్యార్దులకు మంత్రి రోజా, ఆచార్య నాగార్జున యూనివర్సీటీ ఉప కులపతి ప్రోఫెసర్ పి. రాజశేఖర్, సినీనటుడు సంపూర్ణేష్ బాబు ట్రోఫీ అందించారు. కార్యక్రమంలో ఆచార్య నాగర్జున యూనివర్సీటీ రెక్టార్ ప్రోఫెసర్ పి. వరప్రసాద్ మూర్తి, రిజిస్ట్రార్ ఫ్రోఫెసర్ కరుణ, యువజనోత్సవాల కో ఆర్డినేటర్, ఓఎస్డీ సునీత, యూనివర్సీటీలోని వివిధ విభాగాల ప్రోపెసర్లు, అధ్యాపకులు, విద్యార్దులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement