Friday, April 19, 2024

Big Breaking: జయహో ఇస్రో.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 సూపర్‌ సక్సెస్‌

సూళ్లూరుపేట/శ్రీహరికోట (ప్రభన్యూస్‌): అంతరిక్ష ప్రయోగాలలో మరో ఘన విజయాన్ని ఇస్రో సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌ నుంచి పూర్తి వాణిజ్య ప్రరంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌3 రాకెట్‌ ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.. ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌తో పాటు శాస్త్రవేత్తలు, దేశ ప్రజల జయజయ ధ్వానాల నడుమ జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.. చిమ్మచీకట్లను చీల్చుకుంటూ నిప్పులు చిమ్ముతూ తనకు నిర్ధేశించిన గమ్యాన్ని చేధించే దిశగా పయనం సాగించింది..

ఎన్నో రాకెట్‌ ప్రయోగాలను చేపట్టి భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంతో పాటు అగ్రరాజ్యాలకు ధీటుగా ప్రయోగాలను చేస్తున్న ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది.. తొలిసారిగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 రాకెట్‌ను పూర్తి వాణిజ్య పరంగా వినియోగించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది .. ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రయోగం మరింత ఉత్సాహాన్ని నింపింది.. 605 కిలోమీటర్లు చేరిన రాకెట్‌ యుకెకు చెందిన 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా కక్ష్యలలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌, శాస్త్రవేత్తలు షార్‌లో సంబరాలు చేసుకున్నారు..

- Advertisement -

ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా సరికొత్త ప్రయోగాలకు నాంది పలుకుతూ ఘన విజయాలను సాధిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన జీఎస్‌ఎల్‌శీ -మార్క్‌3 రాకెట్‌ ప్రయోగం సూపర్‌సక్సెస్‌ అయ్యింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) ఇందుకు వేదికగా మారింది. షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపై నింగికెక్కుపెట్టిన బాణంలా ఉన్న జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ 24గంటల కౌంట్‌టౌన్‌ శనివారం అర్థరాత్రి 12.07గంటలకు 0కు చేరుకున్న వెంటనే నారింజ రంగు నిప్పులు చిమ్ముకుంటూ గగనతలం వైపు దూసుకెళ్లింది.

రాకెట్‌లోని మూడు దశలలో ఒక్కో దశ విడిపోతూ అగ్ర భాగంలో ఉన్న ఉపగ్రహాలను ముందుకు తీసుకువెళ్లాయి. భూమికి 605 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 అగ్రభాగాన అమర్చి ఉన్న 5200 కిలోల యుకెకు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టింది. నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను చేరవేయడంతో ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

పూర్తి వాణిజ్య పరంగా చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 ప్రయోగం
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జీంచే దిశగా వేసిన తొలి అడుగు విజయవంతమైంది. ఓ వైపు స్వదేశీ అవసరాల కోసం పనిచేస్తూనే మరో వైపు వాణిజ్య పరంగా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించేందుకు ఇస్రో తన ప్రయణాన్ని నిర్ధేశించుకుంది. ఈ క్రమంలో న్యూస్పేస్‌ ఇండియా, డీఓఎస్‌ సంస్థలు యుకెకు చెందిన వన్‌వెబ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 36 ఉపగ్రహాలను మొదటగా నింగిలోకి ప్రవేశపెట్టే విధంగా వాణిజ్య పరమైన ఒప్పందంతో చేపట్టిన ప్రయోగం విజయవంతం అయ్యింది.

షార్‌లో సంబరాలు ..
జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించడంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ రాకెట్‌ విజయవంతం అయిన అనంతరం ప్రసంగించారు. జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో పాటు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రయోగం విజయవంతానికి కృషిచేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ – మార్క్‌3 ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం చేసిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాధ్‌తో పాటు శాస్త్రవేత్తలకు సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య అభినందనలు తెలిపారు. దేశానికే తలమానికంగా నిలిచేలా ఇస్రో చేపడుతున్న ప్రయోగాలు రానున్న రోజుల్లో మరింతగా దేశానికి దోహద పడాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement