Friday, April 19, 2024

జగనన్న విదేశీ విద్యా దీవెన కొత్త పథకం.. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకానికి సంబంధం లేదు

అమరావతి, ఆంధ్రప్రభ: విదేశీ విద్య పథకానికి అంబేద్కర్‌ పేరు తొలగించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేరు పెట్టు-కున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు.అవాస్తవాలు అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేసి తద్వారా రాజకీయంగా లాభం పొందాలని చూసే చంద్రబాబు నాయుడు, పచ్చ పార్టీ నేతలు ఇప్పుడు మరో కొత్త అబద్దాన్ని ప్రచారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి’ అనే ఒక పథకం ఉండేదనడం వాస్తవం, కానీ ఆ పథకానికీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు ప్రకటించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకానికీ ఎలాంటి సంబంధం లేదని బుధవారం మీడియాకు వివరించారు. ఇవి రెండు వేరు వేరు పథకాలని చెప్పారు. ఈ రెండు పథకాలకు సంబంధించిన నియమాలు, విధి విధానాలు వేర్వేరు అని, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్య నిధి పథకం కేవలం ఎస్సీలు, ఎస్టీలకు మాత్రమే చెందింది కాగా జగనన్న విదేశీ వసతి దీవెన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలతో పాటు-గా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి కూడా సంబంధించిన పథకమని తెలిపారు.

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్య నిధి పథకం కేవలం 15 దేశాలకు మాత్రమే వర్తించిన పథకమని, ఈ పథకం ద్వారా ఏడాదికి ఎస్సీల్లో 300 మందికి. ఎస్టీలలో 100 మందికి మాత్రమే అవకాశం కల్పించే పరిమితమైన పరిధి కలిగిన పథకం అని చెప్పారు. అయితే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 1 నుంచి 200 వరకూ క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీ-లన్నింటికీ వర్తిస్తుందని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలకు చెందిన వారు ఎంత మంది అర్హత సాధిస్తే అంతమందికీ కూడా విదేశీ విద్యను అందించే అపరిమితమైన అవకాశాలను కల్పించే పథకం అని నాగార్జున వివరించారు.

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్య నిధి అనేది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం అని తెలిపారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలకు చెందిన పిల్లలు ఎవరైనా క్యూ.ఎస్‌ ర్యాంకింగ్‌ లో 1 నుంచి 100 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీ-ల్లో సీట్లు- తెచ్చుకుంటే కోటి రూపాయలైనా సరే ఆ ఫీజు మొత్తాన్ని నూటికి నూరు శాతం రీయంబర్స్‌ మెంట్‌, అలాగే క్యూ.ఎస్‌. ర్యాంకుల్లో 101 నుంచి 200 లోపు కలిగిన యూనివర్సిటీ-ల్లో సీట్లు- తెచ్చుకుంటే 50 లక్షల రుపాయల దాకా ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ చేసే పథకమని స్పష్టం చేసారు. 6 లక్షల రుపాయలకు లోపు ఆదాయం కలిగిన వారికి మాత్రమే లబ్ది కలిగించేది అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకమైతే, 8 లక్షల రుపాయల దాకా ఆదాయం ఉన్న వారికి కూడా విదేశీ విద్యను అభ్యసించే అవకాశం కల్పించేది జగనన్న విదేశీ విద్యా పథకం అని మంత్రి తెలిపారు.

గతంలో విదేశీ విద్య పేరిట జరిగిన అక్రమాలు మళ్లీ జరగడానికి అవకాశం లేకుండా పైరవీలు, సిఫార్సులకు వీలు లేని విధంగా, ప్రతిభ కలిగిన పేద పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు పెట్టే విధంగా, పేదరికంలో ఉన్న వారు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ప్రతి ఒక్కరికీ అవకాశం అందే విధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో విశాలధృక్పధంతో దూరదృష్టితో రూపొందించి అమలు చేయాలని నిర్ణయించిన కొత్త పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన అని నాగార్జున స్పష్టం చేశారు.

- Advertisement -

ఇది కొత్త పథకం కావడంతో జగన్మోహన్‌ రెడ్డి పేరు పెట్టడం జరిగిందే తప్ప అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి పథకానికి పేరు మార్చడం జరగలేదని స్పష్టం చేసారు. టీ-డీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పేరుతో అనర్హత కలిగిన వారిని అందలం ఎక్కించి, పైరవీలు, సిఫార్సులకు పెద్ద పీట వేసి ఎన్నో అక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు చెందిన సొమ్మును దుర్వినియోగం చేసిన కారణంగా ప్రస్తుతం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి పథకంపై విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ ద్వారా విచారణ జరుగుతోందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement