Tuesday, April 16, 2024

ఉద్యోగ స‌మ‌స్య‌ల‌పై రంగంలోకి దిగిన జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తులు చల్లార్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగం లోకి దిగుతున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ విషయంలో తప్ప రెండో సారి ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌ కూర్చున్న పరిస్థితి లేదు. అయితే, రాష్ట్రంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య అంతరం రోజురోజుకూ పెరిగి పోతోందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం జగన్‌ వాటికి చెక్‌ పెట్టేలా అడుగులు వేస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలకు కూడా వెళ్లాల్సి ఉండటం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపట్ల తామెప్పుడూ సానుకూలంగా ఉంటామని ఆయన ఇప్పటికే ప్రకటించడం వంటి వాటి నేపథ్యంలో సీఎం జగన్‌ నిర్ణయం కీలక మలుపుగా మారనుంది. సీఎం జగన్‌ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రుల కమిటీ, సీఎస్‌ వంటి వారితో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపి తమ అసంతృప్తిని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈక్రమంలోనే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ఎటువంటి స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. అంతేకాకుండా ఈనెల 9వ తేదీ నుండి ఉద్యమ కార్యాచరణకు దిగాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా తలోచేయి వేసి ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. కాగా, ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పదే పదే చెబుతూ వస్తున్న సీఎం జగన్‌ తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

ఈనెల 16వ తేదీన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను అదేరోజు చెల్లించేందుకు కూడా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈక్రమంలోనే ఉద్యోగుల సమస్యలపై మార్చి 16న ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పీఆర్‌సీ బకాయిలు తదితర అంశాలపై అధికారులు, సలహాదారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ కసరత్తు చేస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది మెగా మార్చ్‌ నిరసనలో భాగంగా అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోని జేఏసీ పిలపు మేరకు విజయవాడలో రోడ్లపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 11వ పీఆర్సీ తదితర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఇప్పుడు కొత్త పిఆర్‌సి వల్ల తమ వేతనాలు తగ్గుముఖం పట్టాయని ఉద్యోగులు భావిస్తున్నారు. జీతాలు కూడా జాప్యం చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో స్వయంగా సీఎం జగన్‌ రంగంలోకి దిగడం ఉద్యోగులకు మంచి జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈనెలాఖరులోపు రూ. 3 వేల కోట్ల చెల్లింపులు :
ఈ నెలాఖరులోగా రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌, సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి,చంద్రశేఖర్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో కూడిన మంత్రుల కమిటీ- అంగీకరించింది. దీంతో ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. అయితే, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 3 వేల కోట్లు విడుదల చేయకపోతే ఏప్రిల్‌ మొదటి వారంలో మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని యూనియన్‌ నేతలు నిర్ణయించారు. గ్యారంటీ- పెన్షన్‌ స్కీమ్‌పై మంత్రుల కమిటీ- తీర్మానం చేయగా, ఉద్యోగులు దానిని తిరస్కరించి సీపీఎస్‌ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు సీపీఎస్‌ సమస్యకు ముగింపు పలికేందుకు ఓపీఎస్‌తో సమానంగా ప్రత్యామ్నాయ పథకాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది కూడా ప్ర భుత్వ ఉద్యోగులకు మరింత ఊరటనిచ్చే అంశంగానే వారు భావిస్తున్నారు. ఈక్రమంలో సీఎం జగన్‌ ఈనెలాఖరు కంటే ముందే అంటే ఈనెల 16నే వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఏం జరగబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రూ.90 వేల కోట్లు వేతనాలకే :
రాష్ట్ర ప్రభుత్వానికి నెలవారీ ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు- కాగా అందులో రూ. 90 వేల‌ కోట్లు జీతాలకే ఖర్చు అవుతుందని పార్టీకి చెందిన ఒక సీనియర్‌నేత చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపుపై మార్చి 16న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటు-ందని తెలిపారు. ఈమధ్యలోనే కొన్ని శక్తులు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయినా, ఉద్యోగుల మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే బ్యాచ్‌లో 1.34 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో ఉద్యోగల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నారన్నారు. ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలోనే కొంత వేచిచూసే ధోరణి ఏర్పడిందేతప్ప ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకూడదన్నది ప్రభత్వ విధానమే కాదని పేర్కొన్నారు. ఉద్యోగులు అపోహలు వీడాలని, ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య దూరం పెంచేందుకు చూస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement