Thursday, April 25, 2024

త్వ‌ర‌లో జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ – న‌లుగురు ఎమ్మెల్సీలకు చోటు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గంలో మార్పులు చేపట్టబోతున్నారా..? నలుగురు మంత్రులపై వేటు వేసి ఆ స్థానంలో నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారా..? వైసీపీ వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ దీనికి అవుననే సమా ధానం వినిపిస్తోంది. సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎం జగన్‌ గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్పటికీ మంత్రివర్గ విస్తరణలో భాగంగానే గవర్నర్‌తో సమావేశం అయ్యారన్న ప్రచారం సాగుతున్నది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అందులో భాగంగానే సీఎం జగన్‌ ముందస్తుగా గవర్నర్‌తో సమావేశం అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. శాసనమండలి ఎన్నికల తర్వాత ఏ క్షణంలో నైనా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని రెండు, మూడు నెలలుగా అన్నివర్గాల్లోనూ చర్చ నడు స్తోంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జరిగిన పలు ముఖ్యమైన సమావేశా లతో పాటు మంత్రివర్గ భేటీలో కూడా సీఎం జగన్‌ మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకుని రాకపోతే మంత్రివర్గంలో మార్పులు చేపట్టడానికి కూడా వెనుకాడనని సీఎం జగన్‌ పరోక్షంగా కొంతమందిని ఉద్దేశిం చి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మండలి ఎన్నికల్లో వైసీపీ పట్టభద్రులకు సంబంధించి మూడు స్థానాలను కోల్పోవడంతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓ స్థానాన్ని చేజార్చుకుంది. అయితే ఆయా జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను ఆశించిన స్థాయిలో ముందుకు నడిపించడంలో పలువురు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారు. సీఎం జగన్‌ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో ఏప్రిల్‌ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందన్న ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.

నలుగురిపై వేటు
2019 మే 30వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌ జూన్‌ 8వ తేదీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 30 నెలల తర్వాత గత ఏడాది ఏప్రిల్‌ 11వ తేదీ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అయితే సీఎం జగన్‌ ఆశించిన స్థాయిలో కొంతమంది మంత్రులు పనిచేయలేక పోతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత శాఖలపై పట్టు కూడా సాధించలేకపోతున్నారు. అసలు శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది మంత్రులున్నారు. ఇదే విషయంపై సీఎం జగన్‌ మంత్రి వర్గ సమావేశంలో వెనుకబడ్డ మంత్రులకు సున్నితంగా క్లాస్‌ కూడా తీసుకున్నారు. అయినా వారిలో మార్పు కనిపించకపోవడం, మండలి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం, తదితర కారణాలు వెరసి ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న నలుగురు సభ్యులపై వేటు వేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.

ఆ స్థానంలో..ఎమ్మెల్సీలకు చోటు
అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ మంత్రి వర్గ విస్తరణపై సంకేతాలు కూడా ఇచ్చారు. మంత్రుల్లో మార్పు రాకపోతే అవసరం అయితే ముగ్గురు, నలుగురు మంత్రులను మార్చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కూడా వెనుకాడమని పలువురు మంత్రులను ఉద్దేశించి కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అదే నిజమై మంత్రి వర్గంలో మార్పులు చేపడితే ఆ స్థానంలో నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. గతంలో హామీ ఇచ్చిన పలువురు నేతలకు సీఎం జగన్‌ ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గతంలో వారంతా మంత్రి పదవులు ఆశించిన వారే కావడంతో ఖచ్చితంగా మండలి నుంచే నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది.

పలువురు మంత్రులకు శాఖలు మార్పు
మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎమ్మెల్సీలకు కేబినెట్‌లో చోటు కల్పించడంతో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మరి కొంతమంది మంత్రులకు శాఖలు కూడా మార్పు చేసే దిశగా సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. సోమవారం సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ అయి దాదాపు గంటంబావు సేపు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. విశాఖలో జరుగుతున్న జీ-20 సదస్సు విషయంపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించారన్న ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో ఆయా జిల్లాల్లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో ఉన్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణ వైపు అడుగులు వేస్తారా..సీఎం జగన్‌ అంత సాహసోపేత నిర్ణయం తీసుకుంటారా అన్న అంశంపై మరోవైపు చర్చ జరుగుతున్నప్పటికీ అత్యధిక శాతం మంది మాత్రం సీఎం జగన్‌ మంత్రివర్గ విస్తరణ చేపట్టి తీరుతారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement