Thursday, September 21, 2023

ఎన్‌సీఎస్‌ షుగర్స్‌లో క్రషింగ్‌ లేనట్లేనా?

సీతానగరం, (ప్రభ న్యూస్‌) : మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం యాజమాన్యం అనుచిత పోకడల కారణంగా ఈ ఏడాదికి చెరకు గానుగలేన ట్లేనని పరిస్థితులు చాటిచెబుతున్నాయి. ఫ్యాక్టరీ సీఈవో శ్రీనివాస్‌ ఇప్పటికే తన బాధ్యతల నుంచి తప్పుకోవడం కూడా పలు సందేహాలను రేకెత్తిస్తోంది. గత నాలుగేళ్ల నుండి యాజమాన్యం అనుసరిస్తున్న అనుచిత పోకడలను జిల్లాకు చెందిన మంత్రులు గానీ, అధికారులు గానీ నియంత్రించకపోవడం సమస్య తీవ్రతను పెంచిపోషించింది. కర్మాగారంలో గానుగ వేయాలంటే కనీసం మూడు నెలల నుండి పనులు ప్రారంభించాలి. దీంతో పాటు మరమ్మత్తులు, అయిలింగ్‌ పనులు కోసం కనీసం రూ. కోటి 50లక్షలు ఖర్చుతో యంత్ర పరికరాలు కొనుగోలు చేసి మరమ్మత్తులు చేసి ఓవర్‌ అయిలింగ్‌ పనులను నిర్వహించాలి. పక్కనే గల సంకిలి చక్కెర కర్మాగారంలో నేటి నుంచి చెరకు క్రషింగ్‌కు ముహుర్తం పెట్టారు. దీంతో సంకిలి కర్మాగారంతో నేరుగా కొంత మంది, దళారులు ద్వారా మరికొంత మంది రైతులు చెరకును తరలించడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎన్‌ సీఎస్‌ కర్మాగారం నుండి గత రెండేళ్లకు రావాల్సిన బకాయిలు రూ. 16.34 కోట్లు ఆర్‌ఆర్‌ చట్టం ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొంత ఊరటనిచ్చినప్పటికీ ఈ ఏడాది క్రషింగ్‌ జరగకపోవడం ఇబ్బందికరమే. ఆర్‌ ఆర్‌ చట్టం ప్రకారం కర్మాగారం ఆవరణలోని పంచదార నిల్వలను చేర్చి ఈ నెల 23న వేలం పాటపెట్టనుండడంతో రైతుల్లో డబ్బులు వస్తాయని నమ్మకం పెరిగింది. భూముల వేలం ఆలస్యమైన ముందుగా పంచదార వేలం పాట వల్ల మూడొంతుల బకాయిలు రావడం ఖాయమని ఆశపెట్టుకుంటున్నారు. కర్మాగార కార్మికులకు ఇప్పటికే ఏడు నెలల వేతనాలు, ఇతర డబ్బులు కలిపి దాదాపు రూ. 6.5 కోట్లుపైగా యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా నియోజకవర్గం ఎమ్మెల్యేలు కనీసం సమస్యలపై స్పందించడానికి కూడా ముందుకు రాకపోవడంపై రైతులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -
   

అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం కార్మికుల ఆందోళన పట్టించుకోకపోవడంతో దాదాపు 300 మంది కార్మికులు రోడ్డు పడడం ఖాయం.. అప్పట్లో సీతానగరం, బొబ్బిలి ల్లో రెండు చెరకు కర్మాగారాలు నిజాం షుగర్స్‌ ఆధ్వర్యంలో పనిచేసాయి. 25 ఏళ్ల క్రితం ఒకటిగా విలీనం కావడం జరిగింది. విలీనమైన తరువాత ఎన్‌ సీఎస్‌ ప్రైవేట్‌ యాజమాన్యంలో నడుస్తున్న ఈ చక్కెర కర్మాగారం నేడు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, దాన్నే నమ్ముకొని జీవిస్తున్న మరికొన్ని కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసి ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకొని క్రషింగ్‌ చేస్తే రైతులకు, కార్మికులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్షాలు కోరుతున్నారు. ఎ న్నో ఏళ్లుగా చెరకు పంటను నమ్ముకొని బతుకులు సాగిస్తున్న తమకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని రైతులు, కార్మికులు కోరుతున్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement