Thursday, April 25, 2024

బతిమిలాడితేనే అత్యవసర వైద్యం.. క్యాజువాలిటీల్లో రోగులను పట్టించుకునే వారే కరువు

కర్నూలు, ప్రభన్యూస్‌ : కర్నూలు సర్వజన వైద్యశాలకు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 2,500 మందికి పైగా చికిత్సకు వస్తుంటారు. వీరిలో సుమారు 600 మంది అత్యవసర వైద్యం కోసం వస్తుంటారు. ఈ విభాగంలో వైద్యం అందాలంటే బ్రతిమిలాడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. స్ట్రెచర్ల నుంచి ఎక్సరే, ఈసిజి, ఎంఆర్‌ఐ తదితర వాటికి నరకయాతన వందశాతం పడాల్సిందే. రోగుల సంఖ్యకు తగ్గట్లు సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనికితోడు పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో రోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. చివరికి రోగుల సహాయకులు క్యాజువాలిటీలోని వైద్యులు, సిబ్బందికి పలుమార్లు బ్రతిమిలాడి సిఫారసులు చేస్తేనే వైద్యసేవలు అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన క్రిష్ణమూర్తి కాలిన గాయాలతో గత కొన్ని రోజుల కింద ఉదయం 6 గంటలకల్లా సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగానికి వచ్చారు. వైద్యులు పరిశీలించి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి పంపారు. కుటుంబ సభ్యులు అతడిని ఆ విభాగానికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలించి తామే అత్యవసర విభాగానికి వచ్చి చూస్తామని పంపారు. మధ్యాహ్నం 2 వరకు రాకపోవడంతో మంటలు తాళలేక అతను అల్లాడిపోయిన పరిస్థితి నెలకొంది.

పాములపాడు మండలం లింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి రాగా అత్యవసర విభాగంలోకి తీసుకువెళ్లేందుకు స్ట్రెచర్‌ దొరకలేదు. గంటపాటు నిరీక్షించిన తర్వాత లభించింది. చివరకు హౌస్‌ సర్జన్‌ చూసి యురాలజీ ఓపికి రమ్మని చెప్పడం గమనార్హం. అనారోగ్యంతో అతను కదలలేకపోతున్నానని చెప్పినా కూడా చేర్చుకోలేదు. చివరికి అక్కడే ఉన్న సీఎంఓ దృష్టికి సమస్యను తీసుకువెళితే వైద్యం అందించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి రోగుల పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నాయి. అత్యవసర వైద్యం అందక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement