Wednesday, April 24, 2024

ఎపి క‌మ‌లంలో క‌ల్లోలం – రాజీనామా బాట‌లో క‌న్నా..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర బీజేపీ లో మరోసారి ‘కన్నా’ కలకలం రేగింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భీమవరం వేదికగా నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమా వేశాలకు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో ఆయన వర్గీయులు గుంటూరు జిల్లాలో సమావేశం ఏర్పా టు చేసి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై తిరుగుబాటు ప్రకటించడం ద్వారా తొందరలోనే కన్నా బీజేపీని వీడతారనే వాదనకు బలం చేకూర్చారు.

భీమవరం భేటీ వేళ… గుంటూరులో రాజీనామాలు
ఓ వైపు కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి అతిరథ మహారథులతో భీమవ రం కేంద్రంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయం లోనే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అనుచ రులు, పెదకూరపాడు నియోజకవర్గ బీజేపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకటించడం కలకలం రేపింది. ఎన్నికల ఏడాది కావడంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ పెద్దలు వ్యూహాలు రూపొందిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా నేతలు ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు పెదకూరపాడు నియోజకవర్గంలోని – క్రోసూరులో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆరోపణలు సంధించారు.

వీర్రాజు వల్లే ఆహ్వానం లేదు – పల్నాడు నేతలు
రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు- పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కర్ణా సైదారావు వెల్లడించారు. కన్నా వర్గమనే కక్షతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం తమను ఆహ్వానించలేదని తెలిపారు. మోడీ ఆశయాలను తాము గ్రామగ్రామానికి తీసుకెళ్లాలనుకుంటుంటే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అడ్డుపడుతున్నట్లు విమర్శించారు. ఫ్లెక్సీల్లో మిత్రపక్ష జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు వేసినా బెదిరింపులకు దిగుతున్నట్లు ఆయన ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేర్కొంటూ అడుగడుగునా అవ మానిస్తున్న నేపధ్యంలో పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సోము వీర్రాజు తన ఆస్తులను పెంచు కోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పెదకూరపాడు బీజేపీ ఇంఛార్జి గంధం కోటేశ్వరరావు ఆరోపించారు. కన్నా వర్గమనే పేరుతో చాలామందిని సోము పక్కన పెట్టారని అన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంలో ఐదొందల మంది వరకు కార్యకర్తలు పాల్గొని పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

కన్నా దారీ అదే?
కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడనున్నట్లు అనుచరుల రాజీనామాల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు వేచి చూసే ధోరణిలో ఉన్నప్పటికీ తొందరలోనే పార్టీనీ వీడనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సోము వీర్రాజుతో ఆయనకు సత్సంబంధాలు లేవు. రానున్న రోజుల్లో ఇవి సర్దుబాటు అయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. పలు సందర్భాల్లో సోము వీర్రాజు ఆరోపణలు సంధిస్తున్న కన్నాతో కొద్ది రోజుల కిందట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. గంటన్నరకు పైగా వీరిద్ధరి మధ్య జరిగిన భేటీ తర్వాత కన్నా పార్టీ వీడతారనే ప్రచారం జరిగినప్పటికీ జాతీయ నాయకత్వం సూచనతో మిన్నుకుండిపోయారు. ఇటీవల ఢిల్లిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు కన్నా హాజరు కాలేదు. ఇంట్లోని ఓ శుభకార్యం ఉందంటూ అఖిల భారత సంఘటనా మంత్రి సంతోష్‌ అనుమతి తీసుకొని వెళ్లలే దని తెలిసింది. వచ్చే నెలలో తాను స్వయంగా వచ్చి కలుస్తానంటూ సంతోష్‌కు కన్నా వివరించారు. అయితే రోజు రోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో జాతీయ నాయకత్వాన్ని కన్నా కలవడం సందేహంగానే మారింది. గత రెండు రోజులుగా రాష్ట్ర పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భీమవరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉండగానే ఇక్కడ పెదకూరపాడులో పల్నాడు జిల్లా నేతలు సమావేశమై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరి జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement