Thursday, December 1, 2022

పారిశ్రామిక ప్రమాదాలపై విచారణ.. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై వేటు

అమరావతి, ఆంధ్రప్రభ: పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు గడచిన మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాలు, అవి జరిగిన తీరు, అధికారుల నిర్లక్ష్యవైఖరి తదితర అంశలను ప్రాతిపదికగా తీసుకుని పలు అంశాలపై నివేదికలు పక్కాగా సేకరించేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ జరిగిన పారిశ్రామిక ప్రమాదాల సంఖ్య, ప్రమాదాలే జరిగిన యూనిట్ల వివరాలు, మరణించిన లేదా గాయపడిన వ్యక్తుల సంఖ్య, ఇతర వివరాలతో పాటుగా గత మూడేళ్ల డేటాను సేకరిస్తోంది. ఈ డేటా విశ్లేషణ ఆధారంగా, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక భద్రతను మరింత మెరుగుపరచడానికి ఫ్యాక్టరీల విభాగాన్ని సరిచేయాలని భావిస్తోంది.

గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇటీవలికాలంలో జరిగిన పలు పారిశ్రామిక దుర్ఘటనలు అనేక మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. అయినప్పటికీ ఈ ప్రమాదాలు తగ్గకపోవడం, ఫ్యాక్టరీల శాఖలోని ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ప్రమాదాలకు గురైన పారిశ్రామిక యూనిట్లు, వాటి సమయం, ప్రమాద తీవ్రత మరియు ప్రభావం గురించి సమాచారాన్ని సేకరించేందుకు ఒక ఫార్మాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మే 7, 2020న విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదం తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది, ఇది అనేక సూచనలను చేసింది. పరిశ్రమలు సూచించిన భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించకపోవడమే రాష్ట్రంలో పునరావృత పారిశ్రామిక ప్రమాదాలకు ఒక కారణమని ఆకమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

- Advertisement -
   

ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రమాదకర పారిశ్రామిక యూనిట్లలో థర్డ్‌ పార్టీ సేప్టీ ఆడిట్‌లు కొనసాగుతున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే అధికారుల తనిఖీల్లో పలు లోపాలున్నట్లుగా ఆ కమిటీ తన నివేదికలో పేర్కొన్న మీదట ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈనేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా లోపాలను సరిదిద్దడానికి మరియు పైస్థాయి వరకు తప్పు చేసిన అధికారులను శిక్షించడానికి ఫ్యాక్టరీల శాఖను సమగ్రంగా మార్చాలని నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, కాకినాడలో వందలాది మందిని ప్రభావితం చేసి నలుగురి ప్రాణాలను బలిగొన్న కొన్ని రోజుల వ్యవధిలోనే మరికొన్ని పారిశ్రామిక యూనిట్లలో పదేపదే ప్రమాదాలు జరగడం విస్మయానికి గురిచేసింది. దీంతో భద్రతా నిబంధనలను పాటించే వరకు మొత్తం పారిశ్రామిక యూనిట్‌ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

భవనాలు మరియు యంత్రాల భద్రతకు సంబంధించి ఫ్యాక్టరీల చట్టం, 1948లోని సెక్షన్‌ 40 ఉంది. ఇది కర్మాగారంలో భవనం, యంత్రాలు లేదా కర్మాగారాన్ని ఉపయోగించడం వల్ల మానవ జీవితానికి లేదా భద్రతకు ఏమైనా ప్రమాదం ఉన్నట్లయితే, ఆ భాగాన్ని మరమ్మత్తు చేసే వరకు లేదా మార్చే వరకు ఉపయోగించలేమని ఇది స్పష్టంగా చెబుతోంది. అది కుదరని పక్షంలో యూనిట్‌ మొత్తాన్ని మూసేయాలి. కానీ, ఈ నిబంధన చివరి భాగాన్ని వర్తింపజేయడంలో ఫ్యాక్టరీ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీల్లోనియంత్రాలు లేదా ప్రాంగణంలో ప్రభావితమైన భాగానికి మాత్రమే మూసివేత ఆర్డర్‌ లేదా నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తున్నారనే అభియోగం నిజమేనని ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. ఈక్రమంలోనే పారిశ్రామిక ప్రమాదాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రమాదాలకు సంబంధించిన వివరాలను గుర్తించి, తప్పు చేసిన అధికారులను చర్యలు తీసుకోవాలని అడుగులు ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement