Thursday, November 30, 2023

AP | సాంకేతికతతో కళకళలాడుతున్న త్రిబుల్‌ ఐటిలు.. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఉచితం

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కలిగిన విద్యార్ధులకు అత్యాధునిక సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం అనుబంధంతో ఏపీలో నాలుగు త్రిబుల్‌ ఐటీ కళాశాలలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంభాలకు చెందిన ప్రతిభ కలిగిన విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో కళాశాలల్లో అనేక సాంకేతికతతో కూడిన లేబరేటరీలు, కంప్యూటర్‌ లాబ్‌, వర్య్చువల్‌ బోర్డులు, గ్రంథాలయాలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -
   

కార్పోరేట్‌ కళాశాలలను తలదన్నేలా త్రిబుల్‌ ఐటి కళాశాలలు రూపాంతరం చెందాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైన క్రీడామైదానం తదితర సకల సదుపాయాలతో త్రిబుల్‌ ఐటి కళాశాలలు కళకళలాడుతున్నాయి. ఈ కళాశాలలో సీటు సంపాధించాలని ప్రతి విద్యార్ధి ధ్యేయంగా పెట్టుకుంటారు. పదవ తరగతిలో ఉత్తమ గ్రేడ్‌ సంపాధించిన విద్యార్ధులను జీపీఏ గ్రేడ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. వారికి త్రిబుల్‌ ఐటి ద్వారా ఇంటర్‌, బిటెక్‌ ఆరు సంవత్సరాల సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) కోర్సును ఉచితంగా అందిస్తున్నారు.

ఇలాంటి అరుదైన అవకాశం యేడాదికి ఒకసారి కల్పిస్తారు. 2024లో జరిగబోయే త్రిబుల్‌ ఐటీ వేశాలలో సీటు సాధించాలంటే నేటి నుంచే కఠోర సాధన చేసి పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించాల్సిందే. త్రిబుల్‌ ఐటిలో ప్రవేశించిన విద్యార్ధి భవిత వందశాతం పదిలమని చాలామంది విద్యావేత్తలు చెబుతుంటారు. మరి భవితను పదిలం చేసుకోవాలంటే సమయాన్ని వృధా చేయకుండా నేటి నుండే శ్రమించి వచ్చే యేడాది జరగబోయె పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు రాబట్టుకోవాలి.

ఏపీలో నాలుగు కళాశాలలు

రాజీవ్‌ గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్‌జియుకెటి) అనుబంధంతో పనిచేస్తున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్‌మెషన్‌ టెక్నాలజీ (ఐఐఐటి)లు ఏపీలో నాలుగు ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వీటిని అమలులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తొలుత మూడు ఉండేవి.

ఆర్‌కె వేలీ/ఇడుపులపాయ (కడప), ఐఐటి నూజివీడు, ఐఐటి బాసరలో మాత్రమె కళాశాలలు ఉండేవి. రాష్ట్ర విభజనలో భాగంగా బాసర తెలంగాణాకు వెళ్లిపోయిగా ఏపీలో రెండు కళాశాలలు మిగిలాయి. రాష్ట్ర విభజన అనంతరం ఒంగోళు, శ్రీకాకుళంలో రెండు త్రిబుల్‌ ఐటి కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు త్రిబుల్‌ ఐటి కళాశాలలు ఉన్నాయి.

ఎంపికయిన విద్యార్ధులకు…

త్రిబుల్‌ ఐటిలో అర్హత సాధించిన విద్యార్ధులు వారికి మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా వారికి కేటాయించిన క్యాంపస్‌లోనె చేరాల్సి ఉంది. అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత మరొక క్యాంపస్‌కు బదిలీ చేయరు. ఎంపికయిన వారికి కళాశాల ఫీజుతో పాటు భోజనం, హాస్టల్‌ సౌఖర్యాలను ఉచితంగా కల్పిస్తారు. యూనిఫాం, బూట్లు, ల్యాప్‌టాప్‌ వంటివి ఉచితంగా అందిస్తారు. పరీక్షల ఫీజు చెల్లించనవసరం లేదు.

ఫెయిల్‌ అయిన విద్యార్ధులు మాత్రం సప్లీమెంటరీ ఫీజు చెల్లించుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ట్యూషన్‌ ఫీజు కింద రూ 1.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. త్రిబుల్‌ ఐటీలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్ధులు బీటెక్‌లో చేరడానికి ఐసెట్‌, ఎంసెట్‌ వంటి పరీక్షలు రాయనవసరంలేదు.

ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా వారికి కేటాయించిన క్యాంపస్‌లో నేరుగా చేరవచ్చు. త్రిబుల్‌ ఐటిలో సెమిష్టర్‌ వారీగా పరీక్షలు ఉంటాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం రెండు, ద్వితీయ సంవత్సరం రెండు సెమిష్టర్లు ఉంటాయి. బిటెక్‌లో ప్రతి ప్రతి సంవత్సరం రెండు చప్పున నాలుగు సంవత్సరాలలో 8 సెమిష్టర్లు రాయవలసి ఉంటుంది. మార్కులను సీజీపీఏలో కొలుస్తారు.

ఎంపిక ఇలా…

18 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్సీల వర్గాలకు చెందిన వారు 21 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఒకో కళాశాలకు 1100 సీట్ల చొప్పున 4,400 సీట్లను ప్రతి యేటా భర్తీ చేస్తారు. మండలానికి రెండు లేదా మూడు సీట్లు కేటాయిస్తారు. కొన్ని మండలాలలో విద్యార్ధులు లేకపోతే మరొక మండలంలో నాలుగు చప్పున సీట్లను కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ నియమావళిని అనుసరించి 10వ తరగతి మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

10వ తరగతి పరీక్షల 4,400 స్లీటలో ఏపీకి చెందిన విద్యార్ధులకు 85 శాతం సీ ట్లు కేటాస్తారు. 15 శాతం సీట్లు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల ఓపెన్‌ మెరిట్‌ ఆధారంగా రిజర్వ్‌ చేయబడతాయి. ఏపీ, తెలంగాణా కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు 5 శాతం సూపర్‌ న్యూమరీ సీ ట్లు అందుబాటులో ఉంటాయి.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి 15 శాతం, పిహెచ్‌ 3 శాతం వెసులుబాటు ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్ధులకు డిప్రివేషన్‌ స్కోర్‌ జోడిస్తారు. ప్రతి యేటా ఆర్‌జియుకె పాలక మండలి ద్వారా డిప్రివేషన్‌ స్కోర్‌ ప్రవేశ నోటిఫికేషన్‌కు ముందు నిర ్ణయిస్తారు. అడ్మిషన్ల నిర్వహణకు కన్వీనర్‌ను నియమిస్తారు.

అందుబాటులో ఉండే గ్రూపులు

ఇంటర్‌లో ఎంపీసీ, ఎంబైపీసీ గ్రూపులు మాత్రమె ఉంటాయి. సబ్జెక్టులు గణితం, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ ఇంగ్లీషు, తెలుగు/సంస్కృతం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, జీవశాస్త్రం ఉంటాయి.

ఇంజనీరింగ్‌లో సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌, ఎక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌,కెమికల్‌, మెకానికల్‌ కోర్సులను అందిస్తారు.

క్రెడిట్‌లు సాధించిన వారికి అదనపు కోర్సులు:

అకడమిక్‌ కోర్‌స్సవర్క్‌ కోసం కొలత యూనిట్‌గా క్రెడిట్‌లను నమోదు చేస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేయడానికి అవసరమైన బోధన లేదా పని గంటల సంఖ్య ఆధారంగా ప్రతి కోర్సుకు క్రెడిట్‌లు నమోదు చేస్తారు. విద్యార్ధి పురోగతిని నిర్ణయించడానికి, గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) లెక్కించడానికి క్రెడిట్‌లను ఉపయోగిస్తారు.

త్రిబుల్‌ ఐటిలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వారికి 40 క్రెడిట్‌లతో సర్టిఫికెట్‌ అందిస్తారు. ఇలా నాలుగు సంవత్సరాల పాటు క్రెడిట్‌లు సాధించిన వారికి ఇంజనీరింగ్‌ డిగ్రీతో పాటు 80 క్రెడిట్‌లతో రెండవ సంవత్సరం ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తరువాత సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా కోర్స్‌ అందిస్తారు. చదువు పూర్తయిన తరువాత వందశాతం ప్లేస్‌మెంట్‌ సాధించేలా చూస్తారు.

10 పరీక్షలు ముగిశాక నోటిఫికేషన్‌…

2024లో పదవ తరగతి పరీ క్షలు ముగిసి ఫలితాలు వెల్లడయిన తరువాత నోటిఫికేషన్‌ విడుదాల చేస్తారు. ఈ యేడాది జూన్‌ నెలలో అడ్మిషన్లు జరిగాయి. కోవిడ్‌ – 19 కారణంగా 2020 – 221 నుంచి 2021-22 వరకు రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేదు. ఈ సమయంలో అడ్మిషన్ల కోసం ఆర్‌జియుకెటి వారు సాదారణ ప్రవేశ పరీక్షను నిర్వహించి సీట్లు కేటాయించారు.

గవర్నింగ్‌ కౌన్సిల్‌ సిఫారసు మేరకు 2022 – 23 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు 4 శాతం డిప్రివేషన్‌ జోడించారు. దీని ద్వారా 10వ తరగతి పరీక్షల ఫలితాలపై ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు 4 శాతం బెనిఫిట్‌ ఉంటుంది. 2024వ సంవత్సరానికి గాను ఆర్‌జెయుకెటి పాలక మండలి నిర్ణయం మేరకు డిప్రివేషన్‌ ప్రకటిస్తారు. ఈ యేడాది 20 క్రెడిట్‌లతో ఆనర్స్‌/మైనర్‌ డిగ్రీ అందించాలని యోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement