Saturday, April 20, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో దర్శనానికి దాదాపు 48 గంటలు సమయం పడుతోంది. వారాంతం, వేసవి సెలవుల నేపథ్యంలో రోడ్డు మార్గాన, నడక మార్గాలలో భక్తులు తండోప తండాలుగా తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1, 2 లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్‌లు వెలుపలకు వ్యాపించాయి. కిలోమీటర్ల కొద్ది వ్యాపించిన క్యూ లైన్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. వైకుంఠం 2 లోని 31 కంపార్టుమెంట్‌తో పాటు నారాయణగిరి ఉద్యానవనాలలోని షెడ్‌లలో భక్తులు నిండి ప్రస్తుతం సర్వదర్శనం క్యూ లైన్‌ ఏటిసి వైపు నుంచి ఎంఎంసి మీదుగా పాత అన్నదానం సముదాయాలను దాటి రాంభగీచా వద్దకు చేరింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లో వేచివున్నారు.

ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను టిటిడి దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ సర్వదర్శన క్యూ లైన్‌మాత్రం అంతకంతకు పెరిగి పోతుంది. దీంతో శ్రీవారి ఆలయంలో మూడు క్యూ లైన్‌లను ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నది. ఇదిలా ఉంటే గదులు కేటాయించె కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. అయితే గదులు ఖాళీలు లేక పోవడంతో టిటిడి రిసెప్షన్‌ అధికారులు భక్తులకు గదులు కేటాయించలేక పోతున్నారు. దీంతో భక్తులు టిటిడి ఏర్పాటు చేసిన లాకర్లను పొంది తమ లగేజిని అందులో భద్రపరుచుని షెడ్‌లలో, చెట్ల కింద సేద తీరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement