Thursday, April 25, 2024

నెరవేరుతున్న దశాబ్దాల కల.. 6న‌ సంగం, నెల్లూరు బ్యారేజీల ప్రారంభోత్సవం

అమరావతి, ఆంధ్రప్రభ: పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నాయి. ఈనెల 6న రెండు బ్యారేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. బ్రిటీష్‌ హయాంలో 140 ఏళ్ళ క్రితం నిర్మించిన సంగం బ్యారేజ్‌ శిధిలావస్థకు చేరుకోవటంతో పునర్నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 1882-83లో బ్రిటీష్‌ బ్రిటీష్‌ప్రభుత్వం పెన్నా నదిపై 0.9 మీటర్ల ఎత్తున సంగం బ్యారేజిని నిర్మించింది. 1886 నుంచి ఈ ఆనకట్ట ద్వారా పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల పరిధిలోని భూములకు సాగు నీరందించింది. కాలక్రమంలో బ్యారేజి పూర్తిగా దెబ్బతింది. స్థిరీకరించిన ఆయకట్టులో పది శాతం భూములకు కూడా నీళ్ళందించే పరిస్థితి లేకుండా పోయింది. సంగం పరీవాహక ప్రాంతంలోని భూములకు మరో నీటి వనరు అందుబాటులో లేకపోవటంతో భూములన్నీ బీడుపడ్డాయి. ఆ ప్రాంతంలోని అనేక గ్రామాలు వలసపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఆందోళనలు.. మరెన్నో అడ్డంకులు.. శంఖుస్థాపన అయినా ఏళ్ళ తరబడి ముందుకు సాగని పనులు.. సంగం బ్యారేజి నిర్మాణం ఒక అడుగు ముందుకూ, రెండడుగులు వెనక్కి నడిస్తున్న క్రమంలో గడిచిన మూడేళ్ళుగా పనుల్లో వేగం పుంజుకుంది. సీఎం జగన్మోహన్‌ రెడ్డి సహకారంతో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేయటం తన ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేశారు. గౌతంరెడ్డి అకాల మరణం తరువాత ప్రభుత్వం బ్యారేజి పనులను మరింత వేగవంతం చేసింది. ఆయన సేవలకు గుర్తుగా మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజిగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ పనులన్నిటినీ పూర్తి చేసుకున్న బ్యారేజిని ఈనెల 6న సీఎం ప్రారంభించనున్నారు. సంగం బ్యారేజి నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలతో పాటు కనుపూరు కాల్వ పరిధిలో 63 వేలు, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలు.. మొత్తం 3.85 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయని అధికారులు చెబుతున్నారు. సంగం బ్యారేజి నిర్మాణం వల్ల వరదల సమయంలో పెన్నానది పొంగి పొర్లి నెల్లూరుకు పొంచి ఉన్న ముంపు సమస్య కూడా పరిష్కారమయినట్టేనని జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. సంగం బ్యారేజీలో 0.45 టీఎంసీల నీటిని స్థిరంగా నిల్వ ఉంచే అవకాశం ఉంది. దీని వల్ల భూగర్భ జలాల నీటి మట్టం పెరిగి సమీప గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య కూడా పరిష్కారమవుతుందని అంచనా. సంగం బ్యారేజి నిర్మాణంలో భాగంగా బ్రిడ్జిని కూడా నిర్మించటంతో నెల్లూరు జిల్లాలోని సంగం, పొదలకూరు మధ్య అనేక గ్రామాల రాకపోకలు కూడా మరింత సులభతరం కానున్నాయి.

నెల్లూరులో పెన్నాపై మరో బ్యారేజి..

నెల్లూరు నగరం మీదుగా ప్రవహించే పెన్నా నదిపై ఇప్పటికే ఉన్న పాత వంతెనకు అత్యంత సమీపంలో నిర్మించిన మరో బ్యారేజి కమ్‌ బ్రిడ్జిని కూడా ఈనెల 6న సీఎం ప్రారంభించనున్నారు. 2008లో ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులు అనేక అవరోధాలను దాటుకుంటూటూ 14 ఏళ్ళ తరువాత పూర్తయ్యాయి. గతంలో ప్రారంభించి అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల కోసం ప్రభుత్వం రూ 77.37 కోట్లను కేటాయించి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. నెల్లూరు బ్యారేజి వల్ల 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాలకు సాగు నీరందటమే కాకుండా నెల్లూరు-కోవూరు రహదారిలో ఏళ్ళ తరబడి ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ చిక్కుముడులు తొలగిపోనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు..

సంగం, నెల్లూరు బ్యారేజీల ప్రారంభోవ్త్సానికి సీఎం వస్తున్నందున అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 6న మంగళవారం ఉదయం 10.40 గంటలకు సంగం చేరుకోనున్న సీఎం బ్యారేజీని సందర్శించి పైలాన్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం రిమోట్‌ కంట్రోల్‌ ను ఉపయోగించి గేట్లను ఎత్తి బ్యారేజిని ప్రారంభించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహాలను కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం కలిగిరి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి నెల్లూరు బయలు దేరి వెళ్ళనున్నారు. నెల్లూరు బ్యారేజీ ప్రారంభోత్సవం అనంతరం తాడేపల్లికి బయలు దేరనున్నారు. సీఎం రాక సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement