Wednesday, April 24, 2024

భారీ వర్షాల దృష్ట్యా రైల్వే పటిష్ట‌ కార్యాచరణ.. నిరంతర పెట్రోలింగ్‌తో ట్రాక్‌ పర్యవేక్షణ

అమరావతి, ఆంధ్రప్రభ: వర్షాకాలంలో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ప్రయాణికుల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నష్ట నివారణ చేపట్టేలా పటిష్ట కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. అందుకోసం ముందస్తు చర్యలలో భాగంగా జోన్‌ పరిధిలో ఇరవై నాలుగు గంటలూ నిఘా ఏర్పాటు చేసి 87 ప్రమాదకర సెక్షన్లను, 915 వంతెనలను జోన్‌ గుర్తించింది. ఆటంకాలు లేకుండా పెట్రోలింగ్‌ నిర్వహణకు క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తి స్థాయిలో రక్షిత దుస్తులు, పరికరాలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. విభిన్న విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించి పలు చర్యలు తీసుకుంది. రైళ్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ బృందాలను జోన్‌ ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బందులపై దృష్టి సారించింది.

తరచుగా తనిఖీలు
అందులో భాగంగా రైల్వే ట్రాకుల పర్యవేక్షణను తరచుగా చేపట్టాలని నిర్ణయించింది. వర్షాకాలంలో రైల్వే ట్రాకులపై వరద నీరు పారకుండా, రైళ్లు ఆగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతోంది. ట్రాక్‌ ఉన్నంత మేర కాలువలు సజావుగా ప్రవహిస్తున్నాయా అనే అంశంపై నిర్ధారణ కోసం తరచుగా ట్రాక్‌ పర్యవేక్షణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రాక్‌ పొడవునా ఉన్న పరిస్థితులపై సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ట్రాక్‌ దారిలో ప్రమాదకర ప్రాంతాలు/వంతెనల వద్ద పెట్రోలింగ్‌ నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఏదేని సెక్షన్‌లో అసాధారణ వర్షపాతం లేదా తుఫాను నమోదైతే వాతావరణం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ పెట్రోలింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు కీలకమైన సెక్షన్లలో పూర్తి స్థాయిలో కాపలాదారుల ఏర్పాటు చేసింది. నూతనంగా నిర్మించిన వంతెనలు, అప్రోచ్‌ రోడ్లు వంటి కీలక ప్రాంతాలలో పూర్తిస్థాయిలో కాపలాదారులను నియమించింది. వారు నీటి మట్టం స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా చూస్తారు.

ఉమ్మడిగా పర్యవేక్షణ
జోన్‌లోని రైల్వే మార్గాన్ని ప్రభావితం చేసే సుమారు 1917 చెరువులను సంబంధిత రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా చేసిన పరిశీలనలో గుర్తించారు. అలాగే చెరువుల పరిస్థితి, మరమ్మతులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో రాష్ట్రస్థాయి సమావేశాలను కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో చెరువుల తాజా స్థితిపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం కలిగుండాలని అధికారులు నిర్ణయించారు. నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో డ్యాములు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైల్వే వంతెనలను సూక్ష్మంగా పరిశీలించేలా తగిన ఏర్పాట్లు- చేశారు. ఈచర్యలతో మిగులు జలాలను విడుదల చేసినప్పుడు రైల్వే సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. వాతావరణ శాఖ జారీ చేసే జిల్లాల వారీగా వాతావరణ సమాచారం, హెచ్చరికలు, తుఫాను సమాచారంపై దృష్టి సారించడంతోపాటు ఈ సమాచారాన్ని సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తగిన చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. కీలకమైనవిగా గుర్తించిన వంతెనలపై 22 ఆటోమేటెడ్‌ నీటి మట్టం స్థాయి పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయడంతో నిరంతరం అక్కడి నీటిస్థాయి విలువలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. అత్యవసర పరిస్థితులలో వరదలతో అనుకోని ఘటనలు చోటు చేసుకున్నా.. వాటిని ఎదుర్కోవడానికి ఆరు డివిజన్లలో గుర్తించిన ప్రాంతాలలో స్టేషన్లు, గూడ్స్‌ వ్యాగన్లలో ట్రాక్‌/వంతెనల పునరుద్ధరణకు ఇసుక, బండరాళ్లు, ఖాళీ సిమెంట్‌ సంచులు, టార్పాలిన్‌ షీట్లు-, గిర్డర్లు, స్టీల్‌ క్రిబ్స్‌ వంటి అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో ఎటు-వంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అప్రమత్తతతో సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికుల రైళ్ల రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ సమాచారాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement