Sunday, December 8, 2024

AP | ఉదయం విద్యాలయం.. రాత్రి మద్యాలయం..!

  • మందుబాబులకు అడ్డగా మారిని పాఠశాల క్రీడా ప్రాంగణం
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం సీసాలు దర్శనమిస్తున్న వైనం
  • పట్టించుకోని అధికారులు – చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు


దేవిపట్నం, (ఏఎస్‌ఆర్‌ జిల్లా), నవంబర్ 5 (ఆంధ్రప్రభ): అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో బహిరంగా ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఆ మద్యం సీసాలను అక్కడే పగులకొట్టి పడేయటం మద్యం సేవించిన వారికి పరిపాటిగా మారిందని ప్రజలు, మహిళలు వాపోతున్నారు. దేవిపట్నం మండలంలోని ఇందుకూరుపేట గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉదయం విద్యాలయంగా ఉంటే రాత్రి పూట మాత్రం మద్యాలయంగా మారుతుందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మండలంలో ఎక్కడ బడితే అక్కడ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. మద్యం నియంత్రణ, నివారణ ప్రయోజనాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాల్లోనే తరచూ మద్యం సేవిస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. గతం కన్నా ఇప్పుడు విచ్చలవిడిగా పొలాల్లోని చెట్ల కింద, కాల్వకట్టలపైన, చెరువు గట్టుల పైన, వారధుల వద్ద మరీ ముఖ్యంగా ఇందుకూరుపేట హైస్కూల్‌ గ్రౌండ్‌లో మద్యం సేవిస్తున్నారు. ఇలా సేవించిన మద్యం సీసాలను, సారా ప్యాకెట్లను, తాగేసిన ప్లాస్టిక్‌ గ్లాసులను ఇతర వ్యర్ధాలను అక్కడే పడేసి వెళుతున్నారు.

మందుబాబులకు అడ్డగా పాఠశాల క్రీడా ప్రాంగాణం…
ఇందుకూరు పేట, చుట్టు ప్రక్కల గ్రామాల తాగుబోతులకు, మద్యం బాబులకు ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం అడ్డగా మారింది. ఉదయం పాఠశాల నడుస్తుండుగా సాయంత్రం విద్యాలయం ముగిసిన అనంతరం రాత్రివేళల్లో ఈ పాఠశాల ఆట స్థలంలో మద్యంబాబులు మందు కొడుతూ చిందులేస్తూ సీసాలను పగులగొట్టడంతో మద్యాలయంగా మారుతుంది. విద్యార్ధులు మరుస‌టి రోజు వచ్చేసరికి ఆట స్థలం అంతా మద్యం సీసాలతో దర్శనమిస్తూ విద్యార్ధులు నడవడానికి, ఆడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు ఆట ఆడుకునే సమయంలో కాళ్ళలో సీసా పెంకులు గుచ్చుకుని ఆసుపత్రుల పాలైన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

- Advertisement -

రైతన్నలతో పాటు మహిళల అవస్థలు….
మందుబాబులు విద్యాలయాలనే కాదు అన్నం పెట్టే అన్నదాతల పొలాలను సైతం వదలడం లేదు. పరిసర ప్రాంత పొలాల్లో మద్యం సేవించి అక్కడే సీసాలు పగుల‌కొడుతుండటంతో పొలాలకు పోయే రైతులు, మహిళలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగులగొట్టిన సీసా పెంకులు ప్రమాదకరంగా ఉండి కాళ్ళకు గుచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టల్లోనూ కుంటల్లోనూ, పొలంలోనికి వెళ్లే మార్గాల్లో సీసాలు పగులగొట్టి వేయటం వలన రైతులు, కూలీలు, గొర్రెలు, పశువుల కాపరులు, ఎక్కడ గాజు సీసాలు ఉంటాయోనన్న భయంతో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏదైనా అంటే గొడవకు వస్తున్నారు….
బహిరంగా ప్రదేశాల్లో, పాఠశాల అవరణలో పంట పోలాల్లో మద్యం తాగవద్దని మందు బాబులకు చెప్పినా, ఏదైనా అన్నా వెంటనే అన్న వారి మీదకు, చెప్పిన వారికి ఎదురుతిరిగి గొడవకు వచ్చి వాదనలు పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో మద్యం తాగకుండా నివారించడానికి చేపట్టే చర్యలు అంతంత మాత్రమే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాల క్రీడా ప్రాంగణంలో మద్యం తాగే వారిని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement