Saturday, December 10, 2022

Big Story : కృష్ణా జలాల పంపకాలపై కీలక భేటీ.. ఈనెల 24న ఆర్‌ఎంసీ సమావేశం

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాలతో పాటు ఇతర కీలక విషయాలపై చర్చించి తీర్మానాలు చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబీ) రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈనెల 24న నిర్వహించనున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ నుంచి జలవనరుల శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కృష్ణా బోర్డు విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆర్‌ఎంసీ సమావేశాలు నాలుగయిదుసార్లు వాయిదాపడగా మరికొన్నిసార్లు ఉమ్మడి ప్రాజెక్టులపై తుది తీర్మానాలు ఆమోదం పొందకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్‌, శ్రీశైలం నిర్వహణలోనూ, వరద జలాల లెక్కలు, జలవిద్యుదుత్పత్తికి అనుసరించాల్సిన నిబంధనలు, ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏ ప్రాంతానికి ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే అంశంపై నియమావళి (రూల్‌ కర్వ్‌) రూపకల్పన చేయటంలో ఏపీ, తెలంగాణల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు.

- Advertisement -
   

దీంతో ఆర్‌ఎంసీ సమావేశాలు తుది నిర్ణయాలకు అవకాశం లేకుండానే ముగుస్తున్నాయి. ఆర్‌ఎంసీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా నివేదికను రూపొందించాక కృష్ణా బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటు-ంది. రెండు రాష్ట్రాల్లో ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు ముగిసినా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. బోర్డు నిర్వహణ నియామవళితో సంబంధం లేకుండానే అందుబాటులోకి వచ్చిన జలాలను రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022-2023 నీటి సంవత్సరంలో మిగిలి ఉన్న సమయానికైనా విదివిధానాలు అమలు చేసేందుకు వీలుగా ఈనెల 24న నిర్వహించనున్న సమావేశంలో తుది తీర్మానాలు చేయాలని కృష్ణా బోర్డు భావిస్తోంది. కృష్ణా బేసిన్‌లో నీటి పంపకాలతో పాటు వరద జలాల లెక్కలు, రూల్‌ కర్వ్‌ ఇతర విషయాలపై రెండు రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయంతో ముసాయిదా రూపొందించి అమలు చేసేందుకు వీలుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీని నియమించింది. కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్‌.కె పిళ్ళై కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కమిటీలో రెండు రాష్ట్రాలు జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ)లు, విద్యుదుత్పత్తిపై చర్చించేందు కోసం రెండు రాష్ట్రాల జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌లను సభ్యులుగా ఉన్నారు.

విద్యుదుత్పత్తి నియంత్రణకు ఏపీ పట్టు

నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం నుంచి నీటిని తోడేస్తూ తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుదుత్పత్తిపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2020-21, 2021-22 నీటి సంవత్సరాల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి వల్ల తీవ్రంగా నష్టపోవటంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుతో పాటు కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం డెడ్‌ స్టోరేజికి చేరువైన సమయంలో, ఎగువ నుంచి వరదలు కూడా లేని సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఏపీ ఆరోపిస్తోంది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నియంత్రణపై విధివిధానాలు రూపొందించటంతో పాటు వాటి అమలుకు ప్రోటోకాల్‌ పాటించాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది. వరద జలాల లెక్కల విషయంలోనూ ఏపీ అధికారులు తమ వాదన బలంగా వినిపిస్తున్నారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణాకు దిగువన ఉన్న ఏపీకి వరదల రూపంలో సముంద్రంలో కలిసే మిగులు జలాలపై సంపూర్ణ హక్కులున్న సంగతిని గుర్తు చేస్తోంది. కృష్ణాలో నికర జలాల పంపిణీ అంశంలో మిగులు జలాల ప్రస్తావనకు అవకాశమే లేదని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ కూడా కృష్ణా జలాలను ఏపీ బేసిన్‌ అవతలకు తరలిస్తోందని ఆరోపిస్తోంది. గాలేరి-నగరి నుంచి హంద్రీనావాకు నీటి తరలిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తోంది. అనుమతుల్లేని ప్రాజెక్టులకూ, అందులోనూ కృష్ణా బేసిన్‌తో సంబంధంలేని ప్రాంతాలకు నీటిని తరలించే విషయంలో ఆర్‌ఎంసీ విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 24న నిర్వహించనున్న సమావేశంలో రెండు రాష్ట్రాలతో చర్చించటం ద్వారా కృష్ణాబోర్డు రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ- కీలక తీర్మానాలకు తుదిరూపునిచ్చే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement