Thursday, April 25, 2024

Delhi: విభజన హామీలు అమలు చేయండి.. పోలవరం పూర్తి చేయండి: ఢిల్లీలో సీఎం జ‌గ‌న్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రాబట్టడం, విభజన హామీల అమలు అంశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ‌తో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చర్చించి, రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపి 24 గంటలు తిరిగేసరికి విజయవాడ తిరిగి వెళ్లిపోయారు. విభజన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఢప్తి చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి సీఎం జగన్ సోమవారం ఉదయం ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో కలిశారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు.

ప్రధానితో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. పోలవరం, రీసోర్స్‌ గ్యాప్‌ కింద నిధులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై పీఎంకు వినతిపత్రం అందించి వాటిపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం తాము ఖర్చు పెట్టిన రూ. 2900 కోట్ల రూపాయలను తిరిగివ్వాలని జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా రిఎంబర్స్‌ విధానానికి స్వస్తి చెప్పాలని, దీనివల్ల పనుల్లో విపరీత జాప్యం ఏర్పడుతోందని ఆయన ప్రధానమంత్రి వివరించారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నే పరిగణనలోకి తీసుకుని ఆమేరకు తాము చేస్తున్న పనులకు వెంటనే రిఎంబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులకు 15 రోజుల్లోగా చెల్లింపులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీబీటీ పద్ధతి ద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలని ఆయన కోరారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా అడహక్‌గా రూ.10వేల కోట్లు ఇవ్వాలని ప్రధానమంత్రికి వినతి చేశారు.

రీసోర్స్‌గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు‡చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2014–15 కాలానికి సంబంధించిన బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల రూపంలో, పెన్షన్లు తదితర రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈనిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టంకింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడంవల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఇదివరకే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చానంటూ ఆయన ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ అందుతోందని సీఎం నరేంద్రమోదీకి వివరించారు.

వీరిలో 61శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 41 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని చెప్పుకొచ్చారు. చట్టం నిర్దేశించిన ప్రకారమే గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం మందికి, అర్బన్‌ ప్రాంతంలో 50శాతం మందికి పీడీఎస్‌ కింద ప్రయోజనాలు అందాల్సింది ఉందని ఆయన తెలిపారు. ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌రాష్ట్రాల్లో రాష్ట్రంకంటే కనీసంగా 10శాతం మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారని ప్రధానికి చెప్పారు. దీనివల్ల అర్హులైన వారికి రాష్ట్రంలో ఇది వర్తించట్లేదని, కేంద్రం ఇస్తున్నదానికంటే అదనంగా దాదాపు 56 లక్షలమందికి పీడీఎస్‌ను రాష్ట్రమే వర్తింపజేస్తోందని ఆయన వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారంగా మారిందని, ఇప్పటికే దీనిపై నీతిఆయోగ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై తదుపరి కీలక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న కేటాయింపులను పరిశీలించాలంటూ ప్రధానమంత్రికి జగన్ గుర్తు చేశారు. కోవిడ్‌ సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే, కేంద్రం కవర్‌ చేయని, అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపు చేసిందని, దీనివల్ల సుమారు రూ.5,527.63 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్రం యోయాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కొనసాగిస్తున్నందున ఈ భారం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలన చేయాలని కోరారు. నెలవారీగా రాష్ట్రానికి కేటాయిస్తున్న బియ్యం కోటాలో 3 లక్షల టన్నులు వినియోగం కాకుండా ఉంటున్నాయని, ఇందులో కేవలం 77వేల టన్నులు కేటాయిస్తే సరిపోతుందని, కేంద్రంపై కూడా ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రధానమంత్రికి చెప్పుకొచ్చారు.

విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని వాపోయారు. పార్లమెంటుసాక్షిగా ఇచ్చిన హామీలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక తరగతి హోదా సహా హామీలను అమలు చేయలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక రంగాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రంనుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేకతరగతి హోదా ద్వారా వస్తాయని, తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కొత్తగామూడు కాలేజీలకు అనుమతి ఇచ్చారని, వాటి పనులు కూడా జరుగుతున్నాయని సీఎం వివరించారు.

ఇంకా 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉందని, వాటిని మంజూరు చేయాలని కోరారు. కడపలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధానిని అడిగారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు గనుల కేటాయింపు చాలా కీలకమని, స్థిరంగా ఖనిజం రవాణా అన్నది ప్రాజెక్టు ఏర్పాటులో అత్యంత కీలక అంశమని చర్చించారు. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్‌ మినరల్‌ ఏరియాలను కేటాయించాలను జగన్మోహన్ రెడ్డి కోరారు. 14 ఏరియాల కేటాయింపు అంశం ఇంకా పెండింగులో ఉందన్న ఆయన, ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని అన్నారు.

సమస్యలను పరిష్కరిస్తాం : విద్యుత్ మంత్రి
అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కలిశారు. అరగంటసేపు విద్యుత్ అంశాలపై చర్చించారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ నుంచి రావలసిన రూ.6,756 కోట్ల బకాయిల సమస్య ఎనిమిదేళ్లుగా అపరిష్కృతంగానే ఉందని చెప్పారు. ఈ డబ్బు ఇప్పిస్తే పూర్తిగా కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలు ఒడ్డున పడతాయని, ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని స్పష్టం చేశారు. సీఎంతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలను చర్చించామన్నారు.

తెలంగాణ పెద్దఎత్తున ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. తెలంగాణ నుంచి రావలసిన ఆరువేల కోట్ల రూపాయల బకాయిలపై చర్చించామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సొలిసిటర్ జనరల్ వద్ద ఉందని, త్వరలోనే దీనిపై తాము ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. చట్టం ప్రకారం ప్రాథమికంగా ఎవరు బకాయిలు చెల్లించాలనే దానిని పరిష్కారం చేస్తామని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. పవర్ ఎక్స్చేంజీలలో కొనుగోళ్ల బకాయిలపై సమాచారంలో పొరపాట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 75 రోజుల్లోగా చెల్లించాలని చెప్పారు. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారని మంత్రి ఆర్కే సింగ్ అన్నారు.

రాష్ట్రపతికి అభినందనలు
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్మును జగన్మోహన్ రెడ్డి ఆమె నివాసంలో కలిశారు. పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానుకగా అందజేశారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి సాయంత్రం తిరిగి విజయవాడ వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement