Saturday, April 20, 2024

అండ‌గా ఉంటే ఒంట‌రి పోరుకి సిద్ధం – ప‌వ‌న్ క‌ల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభబ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలుస్తామనే సంపూర్ణమైన విశ్వాసం కలిగితే ఒంటరిగానైనా పోటీకి సిద్దమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. అయితే అందుకు పూర్తిస్థాయిలో రీసెర్చి, డేటా, సర్వేలు చేయించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో జనసేన పార్టీని బలిపశువును కానివ్వబోమని పవన్‌ స్పష్టం చేశారు. తనతో సహా పోటీ చేసే పార్టీ అభ్యర్ధులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతారని, ఆ దిశగా ప్రజలంతా అండగా నిలిచి జనసేనను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో టిడిపితో పొత్తులు కుదిరాయని, ఆ దిశగా సీట్లు కూడా
సర్దుబాటు అయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా 20 సీట్లు అడిగినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను ఓడిపోయినా పార్టీ అభ ్యర్ధులు గెలవకపోయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ జనసేనను మరింత ముందుకు నడిపించామన్నారు. పదేళ్ల క్రితం పార్టీ స్తాపించే సమయంలో తన వెనుక ఎవ్వరూ లేరని, అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా జనసేను మరింత బలోపేతం చేస్తూ వస్తున్నామన్నారు. తెలుగుదేశంపైన తనకు ప్రత్యేకమైన ప్రేమ ఏదీ లేదన్నారు. టిడిపితో సీట్లు సర్దుబాటు అన్న మాట అవాస్తమని చెప్పారు. తాను చెప్పిన ప్రకారం బిజెపి రాష్ట్ర నాయకత్వం పని చేసి ఉంటే అసలు టిడిపితో అవసరమే ఉండేది కాదన్నారు. బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో జనసేనా, బిజెపి కలిసి ఎదిగేందుకు స్పష్టతతో ఉందని, కానీ రాష్ట్ర నాయకత్వం కలిసి రాలేదని అన్నారు. ఆ కారణంగానే ఓటు చీలకూడదని ఏడాది క్రితం ప్రకటన చేయాల్సి వచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు ప్రజలంతా కులాలకు అతీతంగా ఆలోచించి జనసేనకు అధికారం కట్టబెట్టాలన్నారు. ఇందులో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, అన్నికులాలను కడుపులో పెట్టుకొని దగ్గరికి తీసుకోవాలని చెప్పారు.

సంఖ్యాబలం ఉన్న కాపులంటేనే ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ భయపడుతున్నా రని, కాపులు ముందువరుసలో నిలిచి బిసి,ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలను కలుపుకొని వెళితే వీరికి అధికారం దక్కకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్ర యువత అంతా కులాల సంకెళ్ల నుండి బయటపడి జనసేనకు అధికారమిస్తే అన్ని కులాలను కలుపుకోని పోతామని చెప్పారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే జనసేనకు ఓటెయ్యాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదన్న సిఎం జగన్‌కు ఓట్లేసి గెలిపిస్తే మీ ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయని ప్రశ్నించారు. కాపులు అభివృద్ది చెందాలంటే ఇతర కులాలతో ఘర్షణ పడాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు
తాను అమరావతికి మూడు వేల ఎకరాలు చాలని చెప్పానని, కానీ అప్పుడు అందరూ నీకు అభివృద్ది అవసరం లేదా అని ప్రశ్నించారని, ఇప్పుడు ఏమమయిం దని, రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని అన్నారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని, అసలు రాజధానే లేకుండా చేశారని, ఇప్పటికే అభివృద్ది చెందిన విశాఖను రాజధాని చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. లోకాయుక్త కు ఇద్దరు అసిస్టెం ట్‌ లోకాయక్తలను ఇవ్వలేని సిఎం వైఎస్‌ జగన్‌ కర్నూల్‌ను జుడిషియల్‌ కేపిటల్‌ చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ముస్లింలపై ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తాం
తాను ప్రస్తుతం బిజెపితో పొత్తుతో ఉన్నామని, దీనిపై ముస్లీమ్‌ సొదరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అలా భావించవద్దని తనపైన పూర్తి భరోసాను ఉంచమని పవన్‌ కళ్యాన్‌ కోరారు. ముస్లీవ్లుపై ఎవరైనా దాడి చేస్తే వారి తాట తీస్తామన్నారు. ముస్లీమ్‌లపై మత పరంగా దాడులు జరిగితే బిజెపితో పొత్తు తెంచుకుంటానని హామీ ఇచ్చారు. తాను ఓపెన్‌గా బిజెపికి మద్దతునిచ్చానని, కానీ ముస్లీమ్‌లు ఓట్లేసి గెలిపించిన వైఎస్‌ జగన్‌ ఢిల్లిd వెళ్లి దొంగచాటుగా బిజెపి నేతలకు మద్దతు తెలిపి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని దేవాలయాల్లో అపచారం జరిగితే ఇంతవరకు నిందితులను అరెస్ట్‌ చేయలేదని, తాము అధికారంలో వస్తే ప్రార్ధనా మందిరాలపై దాడులను శాంతిభద్రతల సమస్యగానే చూస్తామని చెప్పారు.

- Advertisement -

తెనాలి దంపతులకు సన్మానం
తనకు చెప్పులు తయారు చేసిన తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు దంపతులను ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ సభా వేదిక పైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అలాగే లక్ష రూపాయల చెక్కును బహుమతిగా అందజేశారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల వంతున చెక్కులను పంపిణీ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement