ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో శుక్రవారం చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయ్యింది.
శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు కావడంతో ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు అయింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.