అమరావతి,ఆంధ్రప్రభ: అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైయస్. జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ స్థాయిలో పాఠ్యాంశాలు బోధించే ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ఐబీ సిలబస్ ప్రవేశంపై ఇప్పటికే మార్గదర్శక ప్రణాళిక తయారీకి సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి బుధవారమే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం ఆ తర్వాత ఐబీ సంస్థతో ఎంఓయూ చేసుకుంది. ఎంఓయూపై ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లో, విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతకాలు చేశారు.
సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓల్లి పెక్కా హైనోనిన్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే విద్యలో నాణ్యతను పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తమ పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని అందుకోసమే ఐబీ సంస్థ సహాయాన్ని కోరుతున్నామన్నారు. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది తన ఉద్దేశమన్నారు.
మరే ఇతర ఐబీ ఇంటర్నేషనల్ స్టూడెంట్‌తో అయినా సరిసమానంగా ఉండాలన్నారు. అట్టడుగున ఉన్న విద్యార్ధులకు దీన్ని అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అతిపెద్ద విజయమన్నారు. ఐబీ సిలబస్ అన్నది సవాల్‌తో కూడుకున్నదని,అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అన్నది అటు ఐబీ సంస్థకు కూడా సవాల్‌తో కూడుకున్నదని, కాని సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదని అన్నారు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి మేం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దామన్నారు.
స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి… తరగతిగదుల డిజిటిలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతిగదులనూ డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ చేశామని, పిల్లలందరికీ బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చామని,పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నామని, టోఫెల్ ప్రైమరీ, ఆ తర్వాత టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ విభాగాలుగా వీటిని విద్యావ్యవస్ధలో భాగం చేశామని అన్నారు.
ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని, దీనివల్ల ఈ వయస్సులో పిల్లలకు గుర్తుండిపోతుందని అన్నారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నామని, విద్యాప్రమాణాలను పెంచడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని, దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చామన్నారు. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదని, ఒకటో క్లాసుతో ఇవాళ మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయని, ఏడాదికి ఒక్కో తరగతిపెంచుకుంటూ పోవాలని, ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుందని అన్నారు.
దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే తమ ఉద్దేశమని సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్ప) కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు, ఐబీ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్(సౌత్ ఏసియా) మహేష్ బాలకృష్ణన్, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లొ పాల్గొన్నారు.