Friday, October 4, 2024

TG | సర్కారు ఆసుపత్రిపై ప్రైవేట్‌ పడగ..

ఆంధ్రప్రభ స్మార్ట్, హిందూపురం : పెద్దాస్ప‌త్రి అంటే పేదలకు వైద్యాలయం. అత్యంత ఆధునిక వైద్య చికిత్సలు అందించే స్థాయికి ఎదిగినా… ఈ ఆసుపత్రి వైపు సామాన్య జనం నేను రాను బిడ్డో ఈ సర్కారి దవాఖానాకు అంటూ పారిపోయే ప‌రిస్థితి ఇప్పటికీ ఉంది. ఇందుకు కారణం.. ఈ ఆసుపత్రుల్లో డాక్టరు ఉండరు. ఉన్నా పని చేయరు.

సంతకం పెడతారు. సొంత నర్సింగ్ హోమ్ లో బిజీబిజీగా ఉంటారు. ఈ విషయం జగమెరిగిన సత్యం. ఒకవేళ ఒకరిద్దరు పేదల కోసమే పనిచేస్తే.. వాళ్లను తరిమే వరకూ ఈ గొప్ప డాక్టర్లు నిద్దరోరు. ఇదే సీన్ ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కనిసిస్తోంది. ఈ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు పని చేయరు. ఒకవేళ వైద్యం చేశారో… వాళ్లకు ముప్పు తిప్పలు తప్పవు. .

గైనిక్ వార్డులోనే తంటా…

దాదాపు ప్రతిరోజు వందల మంది పేద మధ్య తరగతి కుటుంబాల గర్భిణులు పెద్దాస్ప‌త్రిలోని గైనిక్ వార్డుకు వస్తుంటారు. పేద‌లు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేరు. అక్కడ లక్షలకు లక్షలు ఖర్చు చేయలేరు. అందుకే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. ఎంతోమంది గర్భిణులు ప్రతీరోజు వస్తూ పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు.

ప్రసూతి సమయంలో ఆసుపత్రిలో చేరుతారు. సుఖ ప్రసవంతో పండంటి బిడ్డల్ని కని తల్లీ బిడ్డల కారులో ఇళ్లకు వెళ్తుంటారు. కొందరు గర్భిణీలకు బిడ్డ అడ్డం తిరిగినా.. ఇతర సమస్య వచ్చినా. తక్షణమే శస్త్ర చికిత్స సదుపాయం ఇక్కడే అందుబాటులో ఉంది. ఇలా పేద, మధ్యతరగతి గర్భిణులు ఇక్కడే పిల్లల్ని కంటుంటే ఇక ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులకు కంట గిట్టటం లేదు.

జిల్లా ఆస్ప‌త్రిలో మెరుగైన వైద్యం

సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, హిందూపురం ఆసుపత్రిలో 200 బెడ్లు ఉంటాయి. ప్రతీరోజు 1000 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. 200 మంది ఇన్ పేషెంట్లు గా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్, ఆప్తా మాలజీ, చిన్నపిల్లలకు చికిత్స, చెవి ముక్కు గొంతు విభాగం, డయాలసిస్, స్కిన్, కంటి విభాగం, గైనిక్ విభాగం.. ఈ విభాగాల్లో 41 మంది డాక్టర్లు పని చేస్తున్నారు.

- Advertisement -

ఈ ఆసుపత్రికి మరిన్ని ఆధునిక సదుపాయాలు కల్పించాల్సిన అవరసమూ ఉంది. ఇప్పటికే హిందూపురం 45 పైగా ప్రైవేటు ఆసుపత్రులు వెలిశాయి. వీటిలో 16 గైనిక్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిని తట్టుకుని పేదలకే వైద్య సేవలు అందిస్తున్న పెద్దాస్పత్రిలో ఇటీవల రాజకీయాలు ఎక్కువై పోయాయి.. ఎక్కువ‌గా గైనిక్ వార్డులో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.

నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. ఇక్కడ ఎవరు విధుల్లో ఉంటారో? ఎవ్వరు జనానికి అందుబాటులో ఉంటారో అర్థం కాదు. ఎందుకంటే అందరికీ సొంత ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు ఉన్నాయని జనం చెబుతుంటారు. తమ వ్యాపారానికి లింకేజీగా ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డాగా చేసుకున్నారని మరో ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేవలం హిందూపురంలోనే కాదు సత్యసాయి జిల్లావ్యాప్తంగా ఈ ప్రైవేటు గైనిక్ స్పెషలిస్టుల కథలు చెబుతుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని నెలతప్పిన విషయం తెలియగానే… ఈ నవ గర్భిణిల్లో అత్యధిక మంది ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో ప్రత్యక్షం అవుతుంటారు.

ఆ డాక్టరే .. వీళ్లకు అడ్డంకి

ఇకపోతే గైనికాలజిస్టు డాక్టర్ బాబా బుడెన్ పేరు ఇటీవల మార్మోగిపోతోంది. ఎందుకని ఆరా తీస్తే ఆయన ఆపరేషన్లు చేయడంలో దిట్ట. హిందూపురంలో ఆయ‌న‌కు ఎలాంటి నర్సింగ్ గాని, ప్రైవేట్ క్లినిక్‌లు గాని లేవు. సక్రమంగా విధులకు హాజరై అన్నీ సక్సెస్ ఆపరేషన్లు చేయటం నైజం.

కొంతమంది డాక్టర్లు ఆయనపై గురిపెట్టినట్లు సమాచారం. ఎందుకంటే ప్రభుత్వాసుపత్రిలో ఇన్ని ఆపరేషన్లు చేస్తుంటే హిందూపురంలో ప్రైవేటు క్లినిక్‌ల ఆదాయం తగ్గిపోతుంది. ఇదీ డాక్టర్ బాబా బుడెన్ నేరం. అంతే బదిలీ కుట్రలు తెరమీదకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. డబ్బులు తీసుకుని వైద్యం చేస్తాడని అపవాదు పడింది.

ఈ అపవాదుతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మర మయ్యాయి. ఇప్పటికే ఇతను మడకశిర పెనుగొండ రావాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు కూడా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటువంటి డాక్టర్లు అక్కడ లేకపోవడంతో తమ నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నారని తమ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే బాలయ్య నియోజకవర్గం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అది కూడా జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి డాక్టర్ల సేవలు ఎంతో అవసరం. ఎంక్వయిరీల పేరుతో కానీ ఈ డాక్టర్ల మధ్య రాజకీయాలతో ఓ మంచి డాక్టరు హిందూపురం నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించటం.. రోగులకే నష్టమని జనం భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement