Tuesday, March 26, 2024

నంధ్యాలలో వైద్య కళాశాలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌.. ప్రభుత్వానికి వెసులుబాటు

అమరావతి, ఆంధ్రప్రభ: నంధ్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకు హైకోర్టు అనుమతిచ్చింది. అక్కడే కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకోవాలని జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు సూచిస్తూ ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు కోసం నంధ్యాల వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది జూన్‌ 20వ తేదీన పాలకవర్గం తీర్మానం చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన పలువురు రైతులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజన వ్యాజ్య్దం దాఖలు చేశారు.

దీనిపై మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరుపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదిస్తూ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్‌ఎంసీకి వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని లేకపోతే ఈ విద్యా సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ కారణంగా దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు ఇచ్చే దరఖాస్తులో వివరించాలని ఆదేశించింది. నిర్మాణంపై గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ జూలై 18వ తేదీకి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement