Thursday, April 25, 2024

ఇంత బ‌రి తెగింపా..

అమరావతి, ఆంధ్రప్రభ : కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? స్వయంగా హాజరైతే తప్ప అమలు చేయరా? రోజుకు ఎన్ని సార్లు మీరు కోర్టుకు వస్తున్నారో తెలుసా? మిమ్మల్ని చూసిన కోర్టుకే చికాకు కలుగుతోందని సీనియర్‌ ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులపై హైకోర్టు మండిపడింది.. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవటం చూస్తే ఏమవుతుందిలే అనే బరితెగిం పా అని ఘాటుగా ప్రశ్నించింది. ఉపాథి హామీ పనుల కింద 2016లో తాను గ్రావెల్‌ సరఫరా చేసినందుకు బిల్లులు చెల్లించలేదంటూ ఓ కాంట్రాక్టర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం బిల్లులు చెల్లిం చాలని ఆదేశించింది. దీనిపై 2022లో కాంట్రాక్టర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు నిర్దేశిత గడువులోగా చెల్లింపులు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశాలు అమలు కాకపోవటంతో కాంట్రాక్టర్‌ ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. గత విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావా ల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పటి పంచాయతీ, గ్రామీ ణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ లతో పాటు ప్రతివాదులుగా ఉన్న అధికారులు కోర్టుకు హాజరయ్యారు. బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యంపై న్యాయమూర్తి ప్రశ్నించారు.

తమ వద్దకు బిల్లులు వచ్చిన వెంటనే చెల్లింపులు జరిపామని కోర్టు ఆదేశాలను అమలు చేశామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ కోర్టుకు నివేదించారు. ఉపాథి హామీ పథకంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని దీనిపై విజిలెన్స్‌ విచారణ కూడా జరుగుతోందని అందువల్ల కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ద్వివేది తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పిటిషనర్‌ కు బిల్లులు చెల్లించే విషయంలో జరిగిన ఆలస్యంపై అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, ప్రకాశం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. బిల్లులు తమ వద్దకు వచ్చిన తరువాత చెల్లింపులు జరిపామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణకు మినహాయింపునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి బట్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టులోనే ధిక్కార పిటిషన్లు కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్నాయని ఆక్షేపించారు. అధికారుల తీరే ఇందుకు కారణమన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు కోర్టుకు హాజరయ్యారని ద్వివేది, రావత్‌లను ప్రశ్నించగా 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో హాజరయినట్లు వారి తరుపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులుగా మీరు ఇన్నిసార్లు కోర్టుకు హాజరు కావడం చూస్తే కోర్టుకే చికాకు (ఎంబ్రాసింగ్‌)గా ఉందని వ్యాఖ్యానించారు. ఏం జరగదులే అనే భ్రమల్లో ఉండవద్దని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement