Wednesday, April 24, 2024

శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ పై హైకోర్టు ఆగ్ర‌హం

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్ లత్కర్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గత ఏడాది మే 3న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు నిర్ణయాన్ని ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదంటూ పిటిషనర్లు ఇటీవల కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై కలెక్టర్ కోర్టుకు ఈనెల 7న హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. అయితే అధికారిక పనుల కారణంగా విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కలెక్టర్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారిక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కలెక్టర్ చెప్పిన కారణం సహేతుకంగా లేదంటూ ఆ అనుబంధ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీడబ్ల్యూ జారీ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement