Wednesday, September 18, 2024

Heavy Rains – ఊపిరాడ‌ని ఉత్త‌రాంధ్ర‌! – ఏకధాటిగా కుంభవృష్టి

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌పై ఎఫెక్ట్‌
ఎగువ‌నుంచి వ‌ర‌ద‌.. గోదావరి ఉగ్ర‌రూపం
నాగావళికి న‌దికీ వరద తాకిడి
సీలేరు, డొంకరాయి ప్రాజెక్టులకు వరద పోటు
కొత్తపల్లి జలపాతం ప‌ర‌వ‌ళ్లు
మన్యంపై కొండల దూకుడు
గాలికొండలో ముగ్గురు గిరిజనుల గల్లంతు
సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబాలు
కోస్తాంధ్ర‌లో భారీ, అతివర్షాల హెచ్చరిక
అప్రమత్తమైన‌ అధికార యంత్రాంగం

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, చింతూరు :
బంగాళాఖాతంలో ఒక వాయుగండ తప్పిందని ఉత్తరాంధ్రా జనం ఊపిరి పీల్చుకుంటే.. మరో వాయుగండం విరుచుకుపడింది. ఒడిశా- బంగాల్ తీరాన్ని ఆనుకుని ఈ వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ తో అప్రమతం చేసింది. జూలై, ఆగస్టు నెలల్లో అడప దడప వర్షాలతో .. ఏరువాక సాగీ సాగింది. మరో వాయుగండం ఉందని వారం కిందటే కబురు అందింది. ఈ స్థితిలో రెండు రోజులుగా ఉత్తరాంధ్రాను కుంభవృష్టి ముంచెత్తింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఎడతెరపిలేని వాన కురుస్తోంది. అటు మన్యంలోనూ, ఇటు సాగరతీరాన జన జీవనం స్థంభించింది.

- Advertisement -

రోడ్లు ధ్వంసమయ్యాయి. పొలాలు నీట మునిగాయి. ప్రాజెక్టులకు వరద పోటు ఉగ్రరూపం దాల్చుతోంది. అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అధికారులు ఇక్కడ రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 379 అడుగులుగా నమోదైంది. తాండవ జలాశయం నుంచి వరద రహదారిపై పొంగి ప్రవహిస్తోన్న క్రమంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఉప్పరగూడెం – గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కల్యాణపులోవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం – తుని మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం – తుని మధ్య వాగులు పొంగి పొర్లుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక రాకపోకలు స్థంభించాయి..

రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వట్టిగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జోలాపుట్ జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అటు, డుడుమా జలాశయం 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా విశాఖలోని ఆంధ్రా వర్శిటీకి సెలవు ఇచ్చారు. సోమవారం జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేశారు. అటు, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

విజయనగరంలో.. జనజీవనం అస్తవ్యస్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విజయనగరం జిల్లా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండురోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని అయ్యన్నపేట కోమటి చెరువు నిండిపోవడం తో రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దుప్పాడ – అయ్యన్నపేట ప్రధాన కూడలిలో వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరగడంతో ఆ ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయింది. దీంతో దుప్పాడ, అయ్యన్నపేట, జొన్న వలస, పినవేమలి, పెదవెమలి, తదితర గ్రామాలకు వెళ్ళే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాలు లోతు ఎత్తు నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో వాహనదారులు ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా ద్వి చక్ర వాహన చోదకులు వాహనం నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంత్రి శ్రీనివాస్ .. ఆరా

ఆదివారం రాత్రి భారీ వర్షం నేపథ్యంలో విజయనగరం జిల్లాలో చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ , ఎస్పీతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్చించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్, ఎస్పీని మంత్రి ఆదేశించారు. అధికార పర్యటనలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ నుంచే కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు. వరద నీటిలో మునిగిన తెర్లాం మండలం నందిగాం రైతులను ఓదార్చాలని, విజయనగరం – విశాఖ రహదారి రాజపులోవ వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరిన నేపథ్యంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసి వాహన రాకపోకలను నియంత్రించాలని, భోగాపురం పోలీసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు

. పార్వతీపురం మన్యం జిల్లాలో 16.8 మిల్లీమీటర్ సగటు వర్షం కురవగా, వీతంపేట, కురుపాం మండలాల్లో అత్యధికంగా 2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాపై వర్ష ప్రభావం, అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్చించారు. నదులు, రిజర్వాయర్లులో నీటి మట్టంపై ఆరా తీశారు. తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో నీటి పరివాహ ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కాలువవైపు వెళ్లకుండా చూడాలని కలెక్టర్కు సూచించారు. అధికారం యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. నీటి పారుదలశాఖ ఈఈని కలెక్టరేట్లోనే ఉంచి, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తూ తగు చర్యలను తీసుకోవాలని మంత్రి సూచించారు.

అరకు ఘాట్ రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు

అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు.

ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గృహల మూసివేత.. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను అధికారులు మూసివేశారు. అడ్డతీగల మండలం… ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు మద్దిగడ్డ రిజర్వాయరు లోకి చేరడంతో రిజర్వాయర్ 188 మీటర్లు గాను ప్రస్తుత నీటిమట్టం 187.4గా రావడంతో మద్ది గడ్డ రిజర్వాయర్ కు చెందిన మూడు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వరద నీరును వదులుతున్నారు… దీని ప్రభావం తో యేలేరు రిజర్వాయరు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

వదర గుప్పెట్లో తూర్పు గోదావరి ఏజెన్సీ

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం లో బురద కాలువకు గండి పడింది. శ్రీరంగపట్నం గ్రామంలోకి వరద నీరు ప్రవేశించి ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాలకు తరచూ శ్రీరంగపట్నం గ్రామం బురద కాలువ ముంపులోకి చిక్కుకుంటుంది. అడ్డతీగల మండలం… ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు మద్దిగడ్డ రిజర్వాయరు లోకి చేరడంతో రిజర్వాయర్ 188 మీటర్లు గాను ప్రస్తుత నీటిమట్టం 187.4గా రావడంతో మద్ది గడ్డ రిజర్వాయర్ కు చెందిన మూడు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వరద నీరును వదులుతున్నారు… దీని ప్రభావం తో యేలేరు రిజర్వాయరు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

వదర ఉధృతికి కాండ్రకోట దబ్బ కాలువపై తాత్కాలిక బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం మైంది. పెద్దాపురం మండలం కాండ్రకోటలో. కాండ్రకోట నుంచి అటు కట్టమూరు. తూర్పు పాకల జే. తిమ్మాపురం గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి కూలిపోవడంతో అప్పట్లో తాత్కాలికంగా మట్టి వారిదని నిర్మించారు. ఆదివారం ఏలేరు రిజర్వాయర్ నుంచి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఈ నీటి ఉధృతికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన పూర్తిగా ధ్వంసం అయింది, అటు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది అలాగే రైతులు కాండ్రకోట నుంచి తమ పొలాలకు వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళవలసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

తాండవ నది తాండవం

తాండవ నది పరవళ్లుకు నది పరివాహక ప్రాంతాలు వణుకు తున్నాయి. ఈనేపథ్యంలో వరద పరిస్థితిని ముందుగానే పసిగట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. రెల్లికాలనికి తాండవ వరద తాకడంతో ఈప్రాంత వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. వరద బాధితులకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈవిషయంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు గండి పడింది. పెద్దాపురం ఆర్ డి ఒ, జాయింట్ కలెక్టర్లు గండి ప్రాంతాన్ని పరిశీలించారు. దిగేవ ప్రజలకు రైతులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పంటపొలాలు నీట మునిగాయి. గ్రామస్తుల సహకారంతో ఇసుక బస్తాలతో గండికి గట్టు ఏర్పాటును ఏర్పాటు చేశారు.

ఏలేరు రిజర్వాయరుకు వరద పోటు

మరోవైపు, కాకినాడ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోటనందూరు మండలంలో అత్యధికంగా 3.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఏలేరు జలాశయం నిండుకుండలా మారగా.. దిగువకు 9,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. కిర్లంపూడి, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.పెద్దాపురం, సామర్లకోట మండలాలకు ముప్పు పొంచి ఉండగా.. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాకినాడ జిల్లాలో అత్యధికంగా పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలకు వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టం చేకూరుతోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది . నియోజవర్గ పరిధిలోని మాదాపురం ఎస్ సీ కాలనీ పూర్తిగా నీట మునిగింది .ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే పిఠాపురం జనసేన ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు . పరిస్థితి సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాలకు వస్తున్నారనే సమాచారంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.

వామ్మో ప్లాష్ ప్లడ్ప్ …

విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 70 కి.మీ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.. రానున్న రెండురోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు భారీ వర్షం సూచన ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. విజయవాడ నగరంలో మరోసారి భారీవర్షం కురుస్తోంది. దీంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేస్తోంది. బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం మూడో గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేశ్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు.
రాకపోకలకు అంతరాయం

వరుసగా కురుస్తున్న వర్షాలతో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వేగావతి నదిపై నిర్మించిన కాజువే కొట్టుకుపోయింది. గతంలో ఓసారి పాక్షికంగా కొట్టుకుపోగా ప్రస్తుతం పూర్తిగా కొట్టుకుపోయాయి. రెండోసారి మరమ్మతులు చేపట్టారు. మళ్లీ కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలకు కీలక రహదారి ఇదే. వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ అవస్థలు ఏర్పడ్డాయి. దీనికిప్రత్యమ్నయంగా కాజువే నిర్మించారు. అది కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బొబ్బిలి మండలంలోని ఛానల్కు గండి ఏర్పడింది. దీని వలన అరటి తోటల , వరి పేర్లు ముగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా విలవిల

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సాయంత్రం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. తిరువూరు పట్టణ ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. తిరువూరు బైపాస్ రోడ్డు కూడలి నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు మోకాలి లోతులో ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన తెలంగాణ నుంచి వచ్చి చేరుతున్న వరదతో వాగుల్లో ప్రవాహం పెరిగింది. కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ, అలుగు వాగులు తిరువూరు నియోజకవర్గంలో మరోసారి పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు-అక్కపాలెం రహదారిలో ఇటీవల కోతకు గురైన చెరువుల కరకట్టలు, ప్రధాన రహదారి. గండ్లు పూడ్చకపోవడంతో కరకట్టలు తెగిపోతాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికికి జ్ఞానాపురం బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. విశాఖ జిల్లాలోనూ కొండ చెరియలు విరిగి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లకు ప్రమాదం పొంచివుంది. సమాచారం అందుకున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆ ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరారు. ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. మిగతా ఇళ్లకు కూడా ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement