Thursday, April 25, 2024

భారీ వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద..

కర్నూలు, ప్రభన్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల అవర్తన ద్రోణితో ఏపీ, కర్నాటక రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వీటి మూలంగా ఆదివారం జిల్లాలోని ప్రధాన నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా ప్రాజెక్టులకు వరద ప్రవహం పోటెత్తుతోంది. ముఖ్యంగా కర్నాటక పరిధిలోని తుంగభద్ర జలాశయంకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. జలాశయం ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయానికి లక్ష క్యూసెక్కుల పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయ నీటి మట్టం 1633 అడుగులకు గాను, 1632 అడుగులు, 100.86 టీఎంసీల నీటి నిల్వలకు గాను, 100.51 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి 28 గేట్ల ద్వారా 84126 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదలవుతుంది.

ఇదే సమయంలో కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదోని డివిజన్‌లోని హగరి, వేదవతి నది పొంగిపోర్లుతున్నాయి. వీటి మూలంగా కర్నాటక సరిహద్దు ప్రాంతం మార్ల మడికి గ్రామ సమీపాన హగరి వంతెనపై 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, నదితీరం పొంగిపొర్లడంతో ఇక్కడ రబీలో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా పత్తి, కంది, వేరుశనగ, మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురువడంతో పశ్చిమ ప్రాంతంలో ఉండే సంజీవయ్యసాగర్ (గాజులదిన్నె ప్రాజెక్టు)నిండుకుంది. దీంతో నిన్న ప్రాజెక్టు నుంచి హంద్రీనదిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 4.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టుకు 4వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ఉంది. గాజులదిన్నె నీటి విడుదల కారణంగా హంద్రీ నది తీరం వెంట ఉండే గోనెగండ్ల, కోడుమూరు, క్రిష్ణగిరి, కల్లూరు ప్రాంతల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement