Wednesday, April 24, 2024

Jawad Cyclone: తీవ్ర తుఫానుగా ‘జవాద్’.. ఉత్తరాంధ్రలో రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో తుపాను కేంద్రీకృతమైంది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో జవాద్‌ తుపాను కేంద్రీకృతమైంది. ఉత్తర దిశగా కదులుతున్న తుపాను రేపు (ఆదివారం) మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  దీనిప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.

మరోవైపు జవాద్‌ తుపాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి విద్యుత్‌ శాఖ సన్నద్ధమైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) ముందస్తు ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement