Saturday, April 20, 2024

యువనేత లోకేష్ ను కలిసిన చేనేత కార్మికులు…

కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో చేనేత సామాజిక వర్గీయులు బుధవారం టీడీపీ యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. చేనేత ముడిసరుకులకు జిఎస్ టి రద్దు చేయాలనీ కోరారు. కర్నూలు జిల్లాలో సిరిసిల్లలో మాదిరిగా మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేయాలనీ విన్నవించారు. కోడుమూరులో తయారుచేసిన చేనేత చీరలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో గద్వాల వ్యాపారులు వచ్చి తక్కువధరకు కొనుగోలు చేయడంతో కార్మికులు నష్టపోతున్నారనీ ఆయన దృష్టికి తెచ్చారు. కోడుమూరు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనీ కోరారు. కంప్యూటర్ జకాటీలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకుండా ఇబ్బంది పడుతున్నాం. వాటిని రాయితీపై అందించాలనీ సూచించారు. గత ప్రభుత్వం పట్టుపై ఇచ్చిన రూ.1000 రాయితీని పునరుద్దరించాలనీ కోరారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని తిరిగి అమలుచేయాల‌ని కోరారు. చేనేత కార్మికులకు రాయితీ విద్యుత్ అందించాలని విన్న‌వించారు..

దీనిపై యువనేత లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ చర్యల కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఒక్క ధర్మవరంలోనే 55మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలేద‌ని జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా చేనేతలకు రూ.111 కోట్ల రుణమాఫీ చేశామ‌న్నారు. చేనేత కార్మికులు కోరిన విధంగా చేనేత ముడిసరుకు, ఉత్పత్తులపై జిఎస్సీ రద్దుచేస్తామ‌ని హామీ ఇచ్చారు. చేనేతల వస్త్రాలకు బ్రాండింగ్ చేసి, జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామ‌ని నారా లోకేష్ చెప్పారు. మగ్గాలున్న చేనేతలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని, సిల్క్ సబ్సిడీ, ఆరోగ్య బీమాలను పునరుద్దరిస్తామ‌ని అన్నారు.. కంప్యూటర్ జకాటీల కొనుగోలుకు రాయితీపై రుణసౌకర్యం కల్పిస్తామ‌ని, ఎమ్మిగనూరులో 10వేలమందికి ఉపాధి కల్పించే మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement