Sunday, March 24, 2024

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

చింతలపూడి లో తీవ్ర ఉద్రిక్తత
భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు

గుంటూరు ‍ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొన్నూరు పట్టణ శివారులోని చింతలపూడి గ్రామంలోని నరేంద్ర గృహానికి శుక్రవారం తెల్లవారు ఝామునే భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. చివరకు ఉదయం 7 గంటల సమయంలో ధూళిపాళ్లను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ధూళిపాళ్ల అరెస్ట్ తో చింతలపూడి లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చింతలపూడి చేరుకున్నారు. వారిని గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసు బలగాలు నిలువరించాయి. ధూళిపాళ్ల ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే వాహనానికి కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడ్డారు. పోలీసులు బలవంతంగా వారందరినీ పక్కకు నెట్టేసి ఆ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళింది తెలియక పోవటంతో కార్యకర్తలలో ఆందోళన నెలకొన్నది.

నాన్ బెయిలబుల్ కేసు నమోదు
సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల.నరేంద్ర కుమార్ పై అవినీతి నిరోధక శాఖ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. ధూళిపాళ్ల పై408,409,418,420,465,471,120బి రెడ్ విత్ 34 సెక్షన్ ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ధూళిపాళ్ల సతీమణి కి ఏ సి బి అధికారులు లిఖితపూర్వకంగా సమాచారం అందజేశారు. సంగం డెయిరీలో జరిగిన అవకతవకలు కు సంబంధించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

నిధుల దుర్వినియోగం ఆరోపణ
సంగం డెయిరీ చైర్మన్ గా వున్న ధూళిపాళ్ల ను నిధుల దుర్వినియోగం కు సంబంధించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అవినీతి నిరోధ శాఖ అధికారులు సైతం పోలీసుల వెంట వుండటం గమనార్హం. కొద్దిరోజుల క్రితమే ధూళిపాళ్ల టీడీపీ రాష్ట్ర కార్యాలయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములు వ్యవహారానికి సంబంధించి సి ఐ డి అధికారుల వ్యవహార శైలిపై గత కొద్ది రోజులుగా ధూళిపాళ్ల పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధూళిపాళ్ల అరెస్ట్ చర్చనీయాంశం అయింది.

లోకేష్ పరామర్శ
సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేసిన విషయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి కి ఫోన్ చేసిన లోకేష్ సంఘటన వివరాలు తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో దాదాపు 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని జ్యోతిర్మయి, లోకేష్ కు వివరించారు. విచారణకు తాము అన్నివిధాల సహకరిస్తామని చెప్పినప్పటికీ వినకుండా పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనపై లోకేష్ స్పందిస్తూ ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్నీ విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అని ఆయన కోరారు. ధూళిపాళ్ల పై బనాయించిన అక్రమ కేసులో ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి భంగపాటు తప్పదని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement