Tuesday, March 26, 2024

ప్రాణ‌దాత‌ను క‌రోనా మింగేసింది…

కరోనా తో మృతి చెందిన స్టాఫ్ నర్సు రజనీ,,
సిస్టర్ .. సేవలకిదే తార్కాణం
9నెలల గర్భంతో బాధితులకు అలుపెర‌గిన‌ సేవల్లో
వంద‌లాది మందికి ప్రాణ‌దానం..
కరోనా తో పోరాడి కన్నుమూత

గుంటూరు – ఎంతో మంది కరోనా రోగులకు సేవలందించింది. తన కళ్ళ ముందే కరోనా బాధితులు కన్నుమూస్తున్నా చెక్కుచెదరని మనోధైర్యం ఆమె సొంతం. కరోనా విపత్కర పరిస్థితుల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న విషాదకర సంఘటనలు ఒకపక్క హృదయాన్ని కలచి వేస్తున్నా, ఉక్కుసంకల్పంతో సేవలందిస్తున్న నర్సు లకే గర్వకారణంగా నిలిచింది. ఎంతోమంది రోగులకు తన చేతులతో ప్రాణదానం చేసిన రజని అనే నర్సు చివరకు తనను తాను కాపాడుకో లేక పోయారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజూ వందలమంది కరోనా బాధితులకు అక్కడి వైద్యులు, నర్సులు విసుగూ, విరామం లేకుండా సేవలందిస్తున్నారు. ఆ క్రమంలోనే స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న రజనీ సైతం కరీనా బాధితుల సేవలోనే రోజంతా గడిపేవారు. చివరకు అదే కరోనా మహమ్మారి కోరల నుంచి తప్పించుకోలేక పోయారు. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 9నెలల నిండు గర్భిణీ గా వున్న రజని మరికొద్ది రోజుల్లో పండంటి శిశువుకు జన్మ నివ్వాల్సి వుంది. ఈలోగానే విధి ఆమె ప్రాణాలను బలిగొన్నది. కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చే వారంతా తన కుటుంబ సభ్యులే, వారికి సేవ చేయటం వల్ల ఎంతో తృప్తి కలుగుతుంది అని రజని అంటూ ఉండేవారని సహచరులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రజనీ మృతి తమను ఎంతో కలచి వేసిందని ఆమె సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. రజనీ మిగిల్చిన స్ఫూర్తి తో తాము కరోనా బాధితులకు మరింత సేవ చేయగలమని వారు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement