Saturday, April 20, 2024

ఎపి, తెలంగాణా నీటి ల‌డాయిః గోదారీ గ‌ట్టుంది – మాకు హ‌క్కుంది…

లేఖల యుద్ధం..
గోదావరి బేసిన్‌లో చెక డ్యాంల నిర్మాణంపై ఏపీ ఫిర్యాదు
తెలంగాణాను వివరణ కోరిన గోదావరి బోర్డు
ఇదే అంశంపై ఏపీకి లేఖ రాసిన తెలంగాణ

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్దం కొనసాగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గతంలో చోటుచేసుకున్న జల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో రెండు రాష్ట్రాల మధ్య అంతర్గతంగా జల యుద్దం కొనసాగుతూనే ఉంది. గతంలో కృష్ణా జలాలపై పెద్ద ఎత్తున చోటుచేసుకున్న వివాదం సర్దుమణగకముందే తాజాగా గోదావరి జలాలపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ఇదే విషయంపై ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్దం కూడా సాగుతోంది. ఒకరిపై ఒకరు గోదావరి నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. గోదావరి బేసిన్‌లో ఎక్కువ నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ కొత్త ప్రాజెక్టులను, చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తోందని మొదట్నుంచీ ఆంధ్రప్రదేశ్‌ ప్రశ్నిస్తూనే ఉంది. అయితే అవి అర్థరహితమని తెలంగాణ కొట్టిపారేస్తోంది. గోదావరి బేసిన్‌లో తెలంగాణ అధిక సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టిందని, దీనివల్ల వర్షాలు లేని సమయంలో రాష్ట్రానికి వచ్చే నామమాత్రపు ప్రవాహం దిగువకు రాకుండా సాగునీటికి ఇబ్బందికర పరిస్థి తులు ఎదురయ్యే అవకాశం ఉందని ఏపీ తక్షణమే చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఏపీ జలవనరుల శాఖ రాసిన లేఖలో అందుకు సంబంధించి స్పష్ట మైన ఆధారాలను కూడా చూపింది. ఏయే ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో.. చెక్‌ డ్యామ్‌లను చేపడుతున్నారో లేఖలో పేర్కొంది. ఆ దిశగానే కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, తుపాకుల గూడెం, దేవాదుల ఎత్తిపోతల నుంచి ఎక్కువ నీటిని మళ్లించేలా తెలంగాణ సర్కార్‌ పనులు చేపడుతోందని స్పష్ట ం చేసింది. ఇదే లేఖను గోదావరి బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపి వివరణ కూడా కోరింది. అయితే ఆ లేఖపై స్పందించిన తెలంగాణ జలవనరుల శాఖ చీఫ్‌ మురళీధర్‌ ఇటీవల బోర్డుకు లేఖ రాశారు. అదే లేఖను గోదావరి నీటి యాజమాన్య బోర్డు ఏపీ జలవనరుల శాఖకు
పంపింది. ఇలా గడిచిన వారం పది రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై లేఖల యుద్దం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం గోదావరి యాజమాన్య బోర్డుకు రాసిన లేఖపై తెలంగాణ జలవనరుల శాఖ స్పందించి మరో లేఖను పంపింది. ఆ లేఖలో అంశాలు ఇలా ఉన్నాయి.. గోదావరి జలాలపై ఏపీకి ఎంత హక్కు ఉందో.. తెలంగాణకు కూడా అంతే హక్కు ఉందని, ఆ మేరకే మేము జలాలను ఉపయోగించుకుంటామంటూ ఆ లేఖలో తెలంగాణ స్పష్ట ం చేసింది. గోదావరిలో ఉన్న నీటి లభ్యతలో ఏపీకి 776 టీఎంసీలు, తెలంగాణకు 650 టీఎంసీలు వాడుకునే హక్కు మాత్రమే ఉందని ఏపీ పేర్కొనడం సరైంది కాదని తెలంగాణ వాదిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం గోదావరిలో 1486 టీఎంసీల లభ్యత ఉండగా.. అందులో 975 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు మాత్రమే ఏపీకి ఉన్నాయని గుర్తుచేసింది. పోలవరం, ధవళేశ్వరానికి కలిపి 449 టీఎంసీలు, చిన్ననీటి వనరుల క్రింద 31 టీఎంసీలు, సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఆవిరి 8.67 టీఎంసీలు, పోలవరంలో నీటి ఆవిరి క్రింద 34.92 టీఎంసీలు చూపారని, ఇది కూడా కరెక్ట్‌ కాదని తెలంగాణ వాదిస్తోంది. వాస్తవానికి పోలవరంలో ఆవిరయ్యేది 23 టీఎంసీలు మాత్రమేనని, ఎక్కడా కూడా 776 టీఎంసీలు గోదావరి జలాలు ఏపీకి కేటాయించలేదని తెలంగాణ తన లేఖలో స్పష్ట ం చేసింది. 250కు పైగా ఎక్కువ టీఎంసీలను చూపిస్తుందని, ఫలితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ గోదావరి బోర్డుకు రాసిన లేఖలో స్పష్ట ం చేసింది.
కొత్త ప్రాజెక్టును అడ్డుకోండి
గోదావరి జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు గతంలోనే కేటాయింపులు జరిగాయని, ఆ లెక్కల ప్రకారం తమ వాటా నీటిని అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ చేస్తోందని ఏపీ వాదిస్తోంది. ఆ దిశగా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే అంశాన్ని ఢిల్లిలో అఫెక్స్‌ కౌన్సిల్‌లో కూడా చర్చించింది. ఆ సమయంలో కృష్ణా జలాల వివాదంతో పాటు గోదావరి జలాలపై కూడా చర్చ జరిగినప్పటికీ అవి పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో జల వివాదం కూడా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం ఆ వివాదమే మళ్లిd తెరపైకి వచ్చింది. తెలంగాణలో నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ జలవనరుల శాఖ డిమాండ్‌ చేస్తోంది. ఆ దిశగానే గోదావరి యాజమాన్య బోర్డుకు లేఖ కూడా రాసింది. ప్రస్తుత ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చినప్పటికీ వేసవి కాలంలో సాగు, త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుం దని, దీన్ని దృష్టి లో ఉంచుకుని గోదావరి జలాలపై తెలం గాణలో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లను, వివిధ ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీ గోదావరి బోర్డుకు మరోసారి స్పష్ట ం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య గోదావరి జల వివాదం మళ్లి ముదిరిపాకన పడినట్లవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement