Thursday, April 18, 2024

30 ఏళ్ల నాటి చెరువుకి మూడింది

తెనాలి – 30 ఏళ్ల నాటి చెరువు జగడి గుంట పాలెం పంచాయతీ అధికారుల అలసత్వంతో డంపింగ్ యార్డులా మారుస్తున్నారు. వివరాల్లోకి వెళితే కేంద్రీయ విద్యాలయం రోడ్లో, గ్యాస్ గోడౌన్ దాటిన తర్వాత వచ్చే మూల మలుపులు ఉన్న ఓ మూడెకరాల స్థలాన్ని 30 ఏళ్ల క్రితం ఓ మాజీ వార్డు మెంబర్ కుటుంబం జగడిగుంటపాలెం పంచాయతీకి దానంగా ఇచ్చింది.ఊరి చెరువుగా ఆ మూడు ఎకరాల పొలం లో ఆ రోజుల్లో , ఆ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు ఉపయోగపడేది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా ఈ చెరువు పట్ల పంచాయతీ అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. గతంలో కొన్ని సంవత్సరాల పాటు ఈ చెరువులో చేపల పెంపకం చేపట్టి కౌలుకు ఇచ్చేవారు. పాడుకున్న గుత్తేదారులు అందించే సొమ్ము పంచాయితీకి కొంత ఆదాయంగా వచ్చేది. గత ఐదు సంవత్సరాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ చెరువులో సాక్షాత్తు పంచాయతీ అధికారులే వ్యర్థాలతో నింపడం ప్రారంభించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ ఆ చెరువును డంపింగ్ యార్డ్ కింద మార్చారు. కరోనా నేపథ్యంలో ఇది తగునా. ఓవైపు కరోనా రెండవ దశ ఉధృతంగా సాగుతుండగా ఎంతోమంది విగత జీవులవుతున్నారు. ఈ క్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ వెలుగెత్తి చెబుతున్నారు. ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన పంచాయతీ అధికారులే పరిశుభ్రతను గాలికి వదిలి ఎటువంటి చర్యలు చేపట్టకుండా డంపింగ్ యార్డ్ లా మార్చడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో పందులు పొర్లాడుతున్నాయి. భరించలేని కంపుతో ఆ ప్రాంతమంత నిండుకుంటుంది.ఆ దారిలో వెళ్లాలంటే కష్టతరంగా మారింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టడం లేదంటే అలసత్వం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో మురికి కూపంలా మారిన ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్న ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయం భయంగా ఆవాసం సాగిస్తున్నారు. ఇదే విషయమై ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ ను ఆంధ్రప్రభ వివరణ కోరేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడం విశేషం. ఏది ఏమైనప్పటికీ అధికారులు తక్షణమే స్పందించి ఈ చెరువు విషయమై చర్యలు చేపట్టాలని ఒకవేళ ఆ ప్రాంతాన్ని నింపి పంచాయతీకి ఉపయోగపడేలా నిర్మాణం చేపట్టాలనే ఆలోచన ఉంటే దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో గతంలో మాదిరి చెరువు పూడిక తీసి ఇంకుడు గుంతలా ప్రజా అవసరం తీర్చే నీటి వనరుగా వినియోగించాలని జగడి గుంట వాసులు ముక్త కంఠంతో కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement