Friday, April 19, 2024

రంజాన్ మాసంలో కుటుంబాన్ని మింగేసిన కరోనా…

కుటుంబం మొత్తాన్ని కరోనా మింగేసింది
ఒకరికి తెలియకుండా మరొకరు మృత్యు ఒడిలోకి
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబంలో విషాదం

గుంటూరు – మరణం ఎంత బాధాకరం .. అందులోనూ ఒకరు చనిపోయినట్టు మరొకరికి తెలియకుండా రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తం మృత్యువాత పడటం హృదయవిదారకం. కరోనా మహమ్మారి పవిత్ర రంజాన్ మాసంలోనే గుంటూరు జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం మొత్తాన్ని కబలించి వేసింది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు సభ్యులు కరోనాతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రాజుపాలెం లో పనిచేసి పదవీ విరమణ చేసిన షేక్ ఫరీద్ కుటుంబంలో ఈ పెను విషాదం చోటుచేసుకున్నది. విశ్రాంత ఉపాధ్యాయులు అందరికీ తలలో నాలుకలా వుంది, వారికి చేదోడు వాదోడుగా సహాయపడుతూ వుండే ఫరీద్ ఏప్రిల్ నెలలో కరోనా బారినపడి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఫరీద్ కుటుంబ సభ్యులు సైతం ఒక్కోరోక్కరుగా కరోనా బారిన పడ్డారు. వారందరూ వేర్వేరు చోట్ల ఆసుపత్రులలో చికిత్స పొందుతూ రోజుల వ్యవధిలోనే కన్ను మూశారు.
గుంటూరు లో చికిత్స పొందుతూ ముందుగా ఫరీద్ కుమార్తె మరణించారు. అనంతరం ఫరీద్ మాతృమూర్తి. తర్వాత వంతు ఫరీద్ ది. చివరకు ఫరీద్ భార్యతో పాటు 32 సంవత్సరాల కుమారుడు ఒకే రోజు మరణించారు. వీరిలో ఏ ఒక్కరి మరణం గురించి మరొకరికి తెలియక పోవటం హృదయవిదారకం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య రీత్యా, ఆందోళనకు గురికాకూడదు అనే కారణంతో ఒకరి మరణ వార్తను మరొకరికి తెలియనీయకుండా బంధువులు జాగ్రత్త పడ్డారు. కుటుంబంలో ఒకరు మరణించారన్న సమాచారాన్ని మిగిలిన వారికి ఏవిధంగా తెలియజేయాలనే సందిగ్ధంలో తాము ఎంతో వేదన అనుభవించామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయులకు, పెన్షన్, పదవీ విరమణ సౌకర్యాలు అందేలా చేయటంలో ఫరీద్ ఎంతో కృషి చేస్తుండేవారని, ఆయన కుటుంబం అంతా కరోనా బారినపడి మరణించుకోలేక పోవటాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామని పలువురు ఉపాధ్యాయులు గద్గద స్వరంతో చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ సహాయం చేసే ఫరీద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ మృత్యువాత పడటం హృదయవిదారకం అని మునిసిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement